అందాల హీరో హరనాథ్.. చిరునవ్వుల హీరోయిన్ కె.ఆర్.విజయ జంటగా నటించిన కుటుంబ కథాచిత్రం శ్రీదేవి. మహావిష్ణు పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకి దర్శకుడు బి.యస్.నారాయణ. 1970, సెప్టెంబర్ 17న విడుదలైన ఈ సినిమా సరిగ్గా 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది. గుమ్మడి, సూర్యాకాంతం, సాక్షిరంగారావు, రాజబాబు , అల్లు రామలింగయ్య తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమా అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది.
ప్రేమించి గుళ్ళో పెళ్ళి చేసుకుంటారు హరనాథ, కె.ఆర్.విజయ. ఆ విషయంలో ఇరువురి కుటుంబ సభ్యులకు తెలియదు. ఇంతలో హరనాథ్ విదేశాలకు వెళ్ళిపోతాడు. వారి ప్రేమకు ఫలితంగా కె.ఆర్. విజయ గర్భవతి అవుతుంది. ఒక అమ్మాయి పుడుతుంది. ఆ అమ్మాయి పేరే శ్రీదేవి. కానీ ఆ అమ్మాయిని వేరే వారి పెంపకానికి ఇచ్చేస్తారు. చివరికి ఆ పాప తల్లిదండ్రుల్ని ఎలా చేరుతుంది అన్నదే మిగతాకథ. జి.కె. వెంకటేశ్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు ఎంతగానో ఆకట్టకుంటాయి. ముఖ్యంగా రాశాను ప్రేమలేఖలెన్నో పాట ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచిపోయింది. అయితే ఈ పాటలో వినిపించే బేస్ గిటార్ ను ..జికె అసిస్టెంట్ అయిన ఇళయరాజా ప్లే చేయడం విశేషం.