ఆయన రూపురేఖలు.. లాంగ్వేజ్ .. బాడీ లాంగ్వేజ్.. అన్నీ వైవిధ్యమే. ఏ పాత్ర పోషించినా అందులోని వైవిధ్యత.. ఏ తరహా సినిమా తెరకెక్కించినా … అందులోని విలక్షణత ఆయన్ను అందరికన్నా ప్రత్యేకంగా నిలిపాయి. ఆయన పేరు ఉపేంద్ర. శాండిల్ వుడ్ వాసులు, ఆయన అభిమానులు ఆయన్ను ముద్దుగా ఉప్పి అని పిలుచుకుంటారు.
అప్పటి వరకు తెరపై ఒక రకమైన హీరోయిజానికి అలవాటు పడిన సినీప్రియులకు ఉపేంద్ర హీరోయిజం ఓ షాక్ అనే చెప్పాలి. హీరోయిజం అనే మాటలకు ఓ కొత్త అర్థాన్ని, తనకు మాత్రమే సాధ్యమైన సరికొత్త సొబగులను ‘ఏ’ తో అద్దారు ఉపేంద్ర. అంతేకాదు దక్షిణాదిలో కల్ట్ చిత్రాలకు కేరాఫ్‌గానూ మారారు ఉప్పీ. ఇదే సమయంలో తెలుగులో ‘కన్యాదానం’ చిత్రంలో ఓ ముఖ్య పాత్రను పోషించి తెలుగువారికీ దగ్గరయ్యారు. ఇక ఆ తర్వాత ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘ఉపేంద్ర’, ‘ఒక్కమాట’, ‘రా’, ‘బీ2’, ‘రక్త కన్నీరు’, ‘సూపర్’ వంటివి అటు కన్నడలోనూ ఇటు తెలుగులోనూ వరుస హిట్లను అందుకోవడంతో ఆయన క్రేజ్ ఒక్కసారిగా జాతీయ స్థాయికీ వ్యాపించింది. ముఖ్యంగా సామాజిక సమస్యలను ఆయుధాలుగా చేసుకోని తన చిత్రాలతో దాన్ని ఆయన ఎత్తి చూపే విధానం సినీప్రియులను విపరీతంగా ఆకట్టుకునేది. దీనికి తగ్గట్లుగానే ఆయన హీరోయిజం కూడా ఎంతో విలక్షణమైన రీతిలో దర్శనమిచ్చేది. అందుకే ఆయన హీరోయిజాన్ని ప్రేక్షకులు ముద్దుగా ఉప్పియిజం అని పిలుస్తుంటారు. ఈ పేరు మీదుగా ఉపేంద్ర ‘ఉప్పీదాదా ఎంబీబీఎస్’, ‘ఉప్పి 2’ వంటి చిత్రాలను తెరకెక్కించి విజయాలు అందుకున్నారు. ఆయన్ను కన్నడ రియల్ స్టార్‌గానూ అభిమానిస్తుంటారు అక్కడి సినీప్రియులు. ఇక టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రంలో అల్లు అర్జున్‌కు ప్రతినాయకుడిగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు ఉపేంద్ర. ఇందులో దేవరాజ్‌గా ఆయన కనబర్చిన నటనకు విమర్శకుల నుంచీ ప్రశంసలు దక్కాయి. దీనికి ఉత్తమ సహాయ నటుడిగా సైమా అవార్డును అందుకున్నారు ఉపేంద్ర. ఈ సినిమా తర్వాత ఆయన నుంచి తెలుగు ప్రేక్షకుల ముందుకు మరే చిత్రమూ రానప్పటికీ ఇటీవలే ‘ఐ లవ్ యూ’ చిత్రంతో తెలుగు సినీప్రియులను పలకరించారు. అయితే దీనికి బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనే దక్కింది. నేడు ఉపేంద్ర పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆ విలక్షణనుటుడికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.