నిర్మాణరంగంలో చెయితిరిగిన వ్యక్తి ఆయన. మంచి సినిమాల్ని నిర్మించి.. సమాజాన్ని చైతన్యవంతం చేయాలని తపించిన మనిషి ఆయన. అభ్యుదయ భావాలతో నిండిన  ఎన్నో  అద్భుతమైన సినిమాలు నిర్మించి,  ఇండస్ట్రీ లో పెద్దాయన అని పిలిపించుకొన్న  ఆయన పేరు తమ్మారెడ్డి కృష్ణమూర్తి.  నిర్మాత , దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ఆయన రెండవ కుమారుడు. రవీంద్ర ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించారు తమ్మారెడ్డి కృష్ణమూర్తి. కమ్యూనిష్ట్ భావాలు కలిగిన ఆయన తన పెద్ద కుమారుడికి లెనిన్ బాబు అని పేరు పెట్టుకున్నారు. ఆయన టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు.

విశ్వకవి రవీంద్రనాథ్‌ టాగూర్‌ అంటే కృష్ణమూర్తికి అవ్యాజమైన అభిమానం. రవీంద్ర చిత్ర బ్యానర్‌ మీద మొదట కనపడేది రవీంద్రుని రేఖాచిత్రం. రవీంద్ర ఆర్ట్‌ ప్రొడక్షన్‌ కింద మొదటి ప్రయత్నంగా ‘లక్షాధికారి’ అనే చిత్రాన్ని తమ్మారెడ్డి నిర్మించారు.  ఎన్‌.టి.ఆర్‌., కృష్ణకుమారి జంటగా ఈ చిత్రాన్ని వి.మధుసూదనరావు దర్శకత్వంలో  రూపొందించారు. మధుసూదనరావు, చలపతిరావు ఇద్దరూ ప్రజానాట్యమండలి సభ్యులు కావడం విశేషం. ఈ చిత్రం తరువాత వరుసగా అక్కినేని నాగేశ్వరరావు, శోభన్‌బాబు, కృష్ణంరాజు, రంగనాథ్‌లతో చిత్రాలు నిర్మించారు. ‘జమీందార్‌’, ‘బంగారు గాజులు’, ‘ధర్మదాత’, ‘సిసింద్రీ చిట్టిబాబు’, ‘దత్తపుత్రుడు’, ‘డాక్టర్‌ బాబు’, ‘చిన్ననాటి కలలు’, ‘అమ్మ-నాన్న’, ‘లవ్‌ మ్యారేజ్‌’, ‘ఇద్దరు కొడుకులు’ చిత్రాలు. ‘జమీందార్‌’ చిత్రానికి వి.మధుసూదనరావు; ‘బంగారుగాజులు’ చిత్రానికి సి.ఎస్‌.రావు; ‘ధర్మదాత’, ‘సిసీంద్రి చిట్టిబాబు’ చిత్రాలకు ఎడిటర్‌ అక్కినేని సంజీవి; ‘దత్తపుత్రుడు’, ‘డాక్టర్‌ బాబు’, ‘చిన్ననాటి కలలు’, ‘అమ్మానాన్న’, ‘లవ్‌ మ్యారేజ్‌’ చిత్రాలకు తమ్మారెడ్డి కృష్ణమూర్తి పెద్దకుమారుడు లెనిన్‌బాబు దర్శకత్వం వహించారు. తమ్మారెడ్డి కృష్ణమూర్తి రవీంద్రఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించిన ఆఖరి చిత్రం శోభన్ బాబు హీరోగా నటించిన ఇద్దరు కొడుకులు. నేడు తమ్మారెడ్డి కృష్ణమూర్తి వర్ధంతి. ఈ సందర్భంగా ఆయనకి ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.

Leave a comment

error: Content is protected !!