అందమైన అభినయం.. అభినయానికి తగ్గ అందం. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించే ప్రతిభ,  ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసేంతటి సామర్ధ్యం ఆమె సొంతం. నిన్నటితరం ప్రేక్షకులకు ఆమె ఒక నీలాంబరి. నవతరం ప్రేక్షకులకు మాత్రం కళ్ళతో అభినయించి.. సన్నివేశాన్నే శాసించగలిగే.. శివగామి. పేరు రమ్యకృష్ణ. అసలు పేరు అభినయం.

తెలుగుతో పాటు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో 200 కిపైగా చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకొన్నారు రమ్యకృష్ణ. తొలినాళ్లలో కథానాయికగా నటించి, వెండితెరకు కమర్షియాలిటీని అద్దిన ఘనత ఆమెది. అదంతా ఒకెత్తైతే, ‘నరసింహ’లో ఆమె అభినయం మరో ఎత్తు. కథానాయకుడికే సవాల్‌ విసిరేంత బలమైన మహిళ పాత్రలో ఆమె కనిపించి అదరగొట్టింది. అది మొదలు ఆమె అభినయం ఏటికేడు కొత్త కోణంలో తెరపై ఆవిష్కృతమవుతూనే ఉంది. ‘బాహుబలి’ చిత్రాల తర్వాత మరోసారి ‘శైలజారెడ్డి అల్లుడు’లో శైలజారెడ్డిగా నటించి ప్రేక్షకుల మనసు దోచుకొన్నారు రమ్యకృష్ణ. మద్రాసులో జన్మించిన రమ్యకృష్ణ.. ప్రముఖ హాస్యనటుడు, పాత్రికేయుడు చో రామస్వామి మేనకోడలు.  భరతనాట్యంలోనూ, పాశ్చాత్య, కూచిపూడి నృత్యంలోనూ ప్రావీణ్యం సంపాదించి పలు ప్రదర్శనలు ఇచ్చారు. 14 యేళ్ల వయసులోనే సినీ ప్రయాణాన్ని ఆరంభించారు. 1984లో తమిళ చిత్రం ‘వెల్లై మనసు’లో వై.జి.మహేంద్ర సరసన నటించి ప్రేక్షకుల్ని అలరించారు. తెలుగులో ‘భలే మిత్రులు’ చిత్రంతో పరిచయమయ్యారు. కె.విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన ‘సూత్రధారులు’లో నటించి మంచి పేరు తెచ్చుకొన్నారు. ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ లాంటి అగ్ర కథానాయకులతో కలిసి నటించి స్టార్‌ కథానాయికగా ఓ వెలుగు వెలిగారు. తమిళంలోనూ ఆమె స్టార్‌గా గుర్తింపు తెచ్చుకొన్నారు. హిందీలో ‘బడే మియాన్‌ చోటే మియాన్‌’తో పాటు, పలు చిత్రాలు చేశారు. ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కొనసాగుతున్న ఆమె, బుల్లితెరపై కూడా తనదైన ముద్ర వేశారు. నేడు రమ్యకృష్ణ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

 

Leave a comment

error: Content is protected !!