హరనాథ, జమున నటించిన సూపర్ హిట్ కుటుంబ కథాచిత్రం ‘లేతమనసులు’. 1966 లో విడుదలైన ఈ సినిమా.. ఏవీ మెయ్యప్పన్ నిర్మాణంలో, కృష్ణన్ పంజు దర్శకత్వంలో తెరకెక్కింది. రేలంగి, జీ.వరలక్ష్మి, పద్మానాభం, గీతాంజలి , కృష్ణంరాజు, జగ్గారావు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాకి చిన్నారి కథానాయికల్లాంటి ట్విన్స్ గా కుట్టిపద్మిని ద్విపాత్రాభినయం అద్భుతం.
లల్లి, పప్పి కవల పిల్లలు. పుట్టినప్పటి నుంచీ వారిద్దరూ విడివిడిగా జీవిస్తుంటారు. కానీ ఒకే స్కూల్లో చదువుతుంటారు. కొన్నాళ్ళకు ఇద్దరు తల్లిదండ్రులు ఒకటే అని తెలుసుకుంటారు. చివరికి వారి తెలితేటలతోనూ, ప్రేమాభిమానాలతోనూ అమ్మా నాన్నను ఒకటిగా చేయడమే మిగతా కథ. ఆ కవలల తల్లిదండ్రులు గా హరనాథ, జమున నటించారు. నిజానికి ఈ సినిమా తమిళ సూపర్ హిట్ మూవీ ‘కుళందైయుమ్ దైవముమ్’ కి రీమేక్ వెర్షన్. జయశంకర్, జమున నటించిన ఈ సినిమాలో కూడా కవలలుగా కుట్టి పద్మిని ద్విపాత్రాభినయం చేసింది. యం.యస్. విశ్వనాథన్ సంగీత సారధ్యంలోని పాటలు అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి. ముఖ్యంగా.. కోడి ఒక కోనలో, అందాల ఓ చిలుకా, హలో మేడమ్ సత్యభామ లాంటి పాటలన్నీ అత్యధిక ప్రజాదరణ పొందాయి.
సరిగ్గా ఇదే స్టోరీ లైన్ తో 1989 లో సూపర్ స్టార్ కృష్ణ మహేశ్ బాబు ద్విపాత్రాభినయంలో ‘కొడుకు దిద్దిన కాపురం’గా స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. విజయశాంతి కథానాయికగా నటించిన ఈ సినిమా కూడా అప్పటి జనాన్ని బాగా అలరించింది.