విశ్వవిఖ్యాత నటసార్వభౌమ డా. యన్టీఆర్ తన సినీ కెరీర్ లో ఎన్నో సార్లు పోలీస్ వేషాలేశారు. వాటిలో కొన్ని మంచి హిట్టయ్యాయి. అయితే ‘నిప్పులాంటి మనిషి’ సినిమాలో ఆయన చేసిన పోలీస్ పాత్ర చాలా ప్రత్యేకం. విజయ్ అనే నిజాయితీ పరుడైన పోలీస్ ఆఫీసర్ గా ఆయన అదరగొట్టారు. రవిచిత్ర ఫిల్మ్ బ్యానర్ పై వై.వి.రావు నిర్మాణంలో యస్.డీ లాల్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంది ఈ సినిమా. లత కథానాయికగా నటించిన ఈ సినిమాలో ఇంకా.. సత్యనారాయణ, ప్రభాకరరెడ్డి, రేలంగి, రాజబాబు, రాజనాల, దేవిక , కాంతారావు.. తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.
విజయ్ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోతాడు. చేతికి పురుగెత్తే గుర్రం బొమ్మ ఉన్న బ్రేస్లెట్ ధరించి ఉన్న వ్యక్తి తండ్రిని కాల్చి చంపడం అతడికి గుర్తు ఉంటుంది. పెద్దయ్యాక విజయ్ పోలీసు ఆఫీసరు ఔతాడు. జగదీష్ ప్రసాద్ (ప్రభాకరరెడ్డి) చేసే దొంగ వ్యాపారాలకు అడ్డుఅవుతాడు. లక్ష్మి (లత) కత్తులకు సాన పెట్టే వృత్తితో జీవిస్తుంటే, విజయ్ ఆసరా ఇస్తాడు. అతని వదిన (దేవిక) లక్ష్మికి విద్యాబుద్ధులు నేర్పించి వారితోనే ఉంచుకుంటుంది. వృత్తి పరంగా షేర్ ఖాన్ (సత్యనారాయణ) తో గొడవపడి తర్వాత స్నేహితుడౌతాడు. మధ్యలో ప్రత్యర్ధుల కుట్రతో ఉద్యోగం నుండి సస్పెండ్ ఔతాడు. తండ్రిని చంపిన వ్యక్తిని కనిపెట్టి పగ తీర్చుకోవటం మిగతా కథ.
నిజానికి నిప్పులాంటి మనిషి సినిమా జంజీర్ హిందీ సినిమాకి రీమేక్ వెర్షన్. అమితాబ్ కు స్టార్ డమ్ తెచ్చిపెట్టిన సినిమాల్లో ఇది ఒకటి. ఇందులో షేర్ ఖాన్ గా ప్రాణ్ నటించారు. ప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ సాధించింది. తెలుగులో కూడా అదే రేంజ్ సక్సెస్ సొంతం చేసుకుంది.