సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో మరపురాని సినిమా ‘శ్రీరాజేశ్వరీ విలస్ కాఫీ క్లబ్’ . విజయవారి బ్యానర్ లో నాగిరెడ్డి చక్రపాణి నిర్మాణ సారధ్యంలో బాపు, చక్రపాణి సంయుక్త దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా శ్రీరాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్. జయప్రద కథానాయికగా నటించిన ఈ సినిమాలో ఇంకా.. పద్మనాభం, జగ్గయ్య, జి.వరలక్ష్మి, రమాప్రభ, అల్లు రామలింగయ్య తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. అప్పట్లో ఈ సినిమా తెలుగువారిని భలేగా అలరించింది. పెండ్యాల సంగీత సారధ్యంలోని పాటలన్నీ అప్పట్లో సంగీత ప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి.
క్రైస్తవుడైన మ్యాథ్యూస్ నిరుద్యోగ యువకుడు. ఎక్కడా ఉద్యోగం రాని అతడు.. అతడి స్నేహితుడి సలహా మేరకు మత్తయ్యగా గెటప్ మార్చి.. ఒక బ్రాహ్మణ హోటల్ లో సర్వర్ గా చేరతాడు. అతడి మంచితనంతో ఆ హోటల్ ఓనర్ కు , ఆయన కూతురికి బాగా నచ్చేస్తాడు. అంతేకాదు… ఆ అమ్మాయికి ట్యూషన్ చెప్పడానికి ఒప్పుకుంటాడు. ఫలితంగా ఆ హోటల్ ఓనర్ మత్తయ్యని ఇష్టపడుతుంది. ఆ ఇంటివారు కూడా మత్తయ్యకే ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటారు. చివరికి మ్యాథ్యూస్ .. ఆ ఇంటికి అల్లుడెలా అవుతాడన్నదే మిగతా కథ. నిజానికి ఈ సినిమా ‘మరునాట్టిల్ మలయాళి’ అనే మలయాళ మూవీకి రీమేక్ వెర్షన్. ప్రేమ్ నజీర్ హీరోగా నటించిన ఆ సినిమా కూడా మలయాళీలను బాగా అలరించింది.
.