దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ బిగినింగ్ లో మలిచిన ఆణాముత్యాల్లాంటి చిత్రాల్లో ‘రంగీలా’ ఒకటి. రొమాంటిక్ లవ్ స్టోరీగా … మ్యూజికల్ మ్యాజిక్ చేసిన ఈ సినిమా 1995, సెప్టెంబర్ 8న విడుదలై.. బాలీవుడ్ లో సంచలనానికి తెరతీసింది. సరిగ్గా నేటికి 25 సంవత్సరాల్ని పూర్తి చేసుకున్న ‘రంగీలా’ చిత్రానికి చాలా ప్రత్యేకతలున్నాయి. ఈ సినిమా.. సంగీత దర్శకుడు ఏ.ఆర్.రహమాన్ కు తొలి హిందీ చిత్రం. మొదటి సినిమాతోనే అద్భుతమైన ఒరిజినల్ స్కోర్ ను, జనరంజకమైన ట్యూన్స్ ను ఇచ్చాడు రహమాన్. రంగీలా గా ఊర్మిళా అనితర సాధ్యమైన రీతిలో నటించింది. ఈ సినిమాకి, కె.విశ్వనాథ్ ‘సీతామాలక్ష్మి’కి చాలా పోలికలు కనిపిస్తాయి. .. సినిమా హాల్లో పనిచేసే చంద్రమోహన్ … సీతా మహాలక్ష్మిఅయిన తాళ్ళూరి రామేశ్వరిని ప్రేమిస్తాడు. ఇద్దరూ ఒకరికొకరు ఇష్టపడతారు. సీతామహాలక్ష్మీ ఫేమస్ హీరోయిన్ అయిపోతుంది. చంద్రమోహన్ .. ఆమె తనను పట్టించుకోవడం లేదని ఫీలవుతాడు. కానీ చివరికి సీతాలు .. చంద్రమోహన్ తోనే జీవించాలనుకుంటుంది. అప్పట్లో ఈ సినిమాతో పాటు, ఇందులోని పాటలు కూడా సూపర్ హిట్టయ్యాయి.
ఇక రంగీలా లో .. ఆమిర్ ఖాన్ , జాకీ ష్రాఫ్ హీరోలుగా నటించగా.. గుల్షన్ గ్రోవర్, అవతార్ గిల్, రీమాలాగూ.. తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. దీని కథ విషయానికొస్తే .. మున్నా అనే ఒక అనాథ యువకుడికి .. మిలీ అనే అల్లరి పిల్ల పరిచయం అవుతుంది. కొద్దిరోజులకు వారిద్దరూ మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఇంతలో ఆ అమ్మాయి ఒక సినిమా ఆడిషన్స్ కు వెళ్ళి ఓ స్టార్ హీరోని ఆకర్షిస్తుంది. ఆ హీరో రికమెండేషన్ తో మిలీ కథానాయిక గా ఎంట్రీ ఇస్తుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుంది. ఆ ప్రాసెస్ లోనే హీరో రాజ్ .. మిలీని ప్రేమిస్తాడు. అలాగే.. మున్నా కూడా మిలీని ఎంతగానో ఇష్టపడతాడు. కానీ తనకన్నా మిలీని రాజ్ నే బెస్ట్ అని .. ఆమెను రాజ్ కే వదిలేయాలని భావిస్తాడు. మున్నా మనసును గ్రహించిన మిలీ .. చివరికి మున్నాకే సొంతమవడంతో కథ ముగుస్తుంది. ఈ సినిమా విడదలై పాతికేళ్ళయినప్పటికీ ఇందులోని పాటలు మాత్రం ఇప్పటికీ ఏదో చోట మారుమోగుతునే ఉంటాయి.