యన్టీఆర్ లవకుశ చిత్రంలో లవుడిగా నటించిన బాలనటుడు నాగరాజు గుర్తున్నారా? ముద్దులొలికే మోముతో ఆ సినిమాకే హైలైట్ గా మారిన ఆయన.. .. చాలా చిత్రాల్లో తండ్రిగానూ, కేరక్టర్ ఆర్టిస్ట్ గానూ నటించి మెప్పించారు. ఎక్కువగా ఆయన పౌరాణిక చిత్రాల్లోని వివిధ రకాల పాత్రలు పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరిలో శ్రీదేవి తండ్రి ఇంద్రుడిగా నటించారు. ఆ తర్వాత ‘గుడిగంటలు మోగాయి’ అనే మూవీలో విలన్ గా సైతం నటించి మెప్పించారు.
ఆయన ఈ రోజు కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా శ్వాసకోస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ గాంధీనగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. నాగరాజు మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. భక్తరామదాసు` చిత్రంతో బాల నటుడిగా వెండితెరకు పరిచయమైన నాగరాజు అసలు పేరు నాగేందర్‌రావు. ఇప్పటి వరకు దాదాపు 300చిత్రాలకుపైగా నటించి మెప్పించిన ఆయన `కీలుగుర్రం`, `హరిశ్చంద్ర` సినిమాల్లో నటించిన ఏవీ సుబ్బారావు కుమారుడు నాగరాజు కావడం విశేషం.