అందం.. ఒడ్డు పొడుగు.. నటనా ప్రతిభ..  మంచి తనం..  సంస్కారం మూర్తీభవించిన హీరో అతడు. వైవిధ్యమైన పాత్రలు పోషించడంలోనూ, వెరైటీ కథనాలు ఎంపిక చేసుకోవడంలోనూ అతడు మేటి. పేరు వివేక్ ఒబెరాయ్. ఒకప్పటి బాలీవుడ్ విలక్షణ నటుడు సురేశ్ ఒబరాయ్ తనయుడే వివేక్. తొలి చిత్రంతోనే ఉత్తమ నూతన నటుడిగా.. ఉత్తమ సహాయ నటుడిగా రెండు ఫిల్మ్‌ఫేర్‌లను కైవసం చేసుకొని సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించాడు.

తండ్రి నటవారసత్వం పుణికి పుచ్చుకున్న వివేక్ పుట్టింది హైదరాబాద్ లోనే. అజ్మేర్‌లోని మయో కళాశాలలో, అక్కడి నుంచి జుహులోని మితిబాయ్‌ కాలేజిలో చదువు కొనసాగించాడు. ఈ సమయంలోనే లండన్‌లో జరిగిన ఓ యాక్టర్స్‌ వర్క్‌ షాప్‌కు వివేక్‌ హాజరవగా.. అతనిలోని ప్రతిభను గుర్తించిన ఓ దర్శకుడు అతన్ని న్యూయార్క్‌ తీసుకువెళ్లి ఫిలిం నటనలో మాస్టర్‌ డిగ్రీలో చేర్పించారు. అక్కడే నటనలో రాటుదేలిన వివేక్‌ ఒబెరాయ్‌ 2002లో రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘కంపెనీ’ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. ఈ సినిమాలో చంద్రకాంత్‌గా వివేక్‌ నటనకు సినీప్రియులు, విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు రెండు ఫిలిం ఫేర్‌ అవార్డులను అందుకున్నాడు. కానీ, దీని తరువాత చేసిన ‘రోడ్‌’, ‘దమ్‌’ చిత్రాలు కమర్షియల్‌గా హిట్‌ అవకపోయినా నటుడిగా వివేక్‌కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక 2002లో షాహీద్‌ అలీ దర్శకత్వంలో వచ్చిన ‘సాతియా’.. వివేక్‌ ఒబెరాయ్‌కి కథానాయకుడిగా తొలి విజయాన్ని అందించింది. అయితే తన సినీ కెరీర్‌లో సోలో కథానాయకుడిగా కన్నా మల్టీస్టారర్‌ నటుడిగానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘మస్తీ, యువ, ఓంకారా, గ్రాండ్‌ మస్తీ’ లాంటి సినిమాలు వివేక్‌కు బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చిపెట్టాయి. హృతిక్‌ రోషన్‌ నటించిన ‘క్రిష్‌ 3’ కోసం తొలిసారిగా ప్రతినాయకుడిగా తెరపై మెరిశాడు. ఇక జీవితగాథలు ఆధారంగా తీసిన ‘షూట్‌ ఔట్‌ ఎట్‌ లోఖండ్‌ వాలా’, ‘రక్త చరిత్ర’, ‘రక్త చరిత్ర 2’, ‘రాయ్‌’ వంటి సినిమాలు వివేక్‌ ఒబెరాయ్‌ను నటుడిగా మరో మెట్టు పైకెక్కించాయి. ముఖ్యంగా పరిటాల రవి జీవితాధారంగా వర్మ తెరకెక్కించిన ‘రక్త చరిత్ర’లో ప్రతాప్‌ రవిగా వివేక్‌ చూపిన నటన విమర్శకులను సైతం మెప్పించింది. ఇది వివేక్‌కు తెలుగులో తొలి చిత్రం కావడం విశేషం. రామ్‌చరణ్‌ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘వినయ విధేయ రామ’ చిత్రంతో మరోసారి ప్రతినాయకుడిగా తెలుగు ప్రేక్షకులని అలరించాడు. నేడు వివేక్ ఒబెరాయ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అతడికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

Leave a comment

error: Content is protected !!