మెగాస్టార్ చిరంజీవి నటజీవితంలో మరిచిపోలేని సినిమా ‘ఖైదీనెంబర్ 786’. 1988, జూన్ 10న విడుదలైన ఈ సినిమా అప్పట్లో అభిమానుల్ని భలేగా అలరించింది. భానుప్రియ కథానాయికగా నటించిన ఈ సినిమాకి దర్శకుడు విజయబాపినీడు. కైకాల సత్యనారాయణ, నూతన్ ప్రసాద్, ముక్కురాజు, కోట శ్రీనివాసరావు, నిర్మలమ్మ తదితరులు నటించిన ఈ మూవీ ఒక ఫ్యామిలీ రివెంజ్ డ్రామా. ఒక ధనవంతుడి అహంకారపు కూతురు.. ఓ పేద యువకుడ్ని ప్రేమించినట్టు నమ్మించి వంచించి పెళ్ళి చేసుకుంటుంది. ఆపై ఆమె తండ్రి అతడ్ని హత్యానేరంపై ఉరికంబానికి పంపుతాడు. మరి ఆ యువకుడు తన నిర్దోషిత్వాన్ని ఎలా నిరూపించుకున్నాడు అన్నదే మిగతాకథ. రాజ్ కోటి సంగీత సారధ్యంలోని పాటలు అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి. ముఖ్యంగా గువ్వా గోరింక తో పాట.. ఇప్పటికీ ఏదో చోట మారుమోగుతునే ఉంటుంది. నిజానికి ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టైన ‘అమ్మన్ కోవిల్ కిళక్కాలే’ సినిమాకి రీమేక్ వెర్షన్. విజయ్ కాంత్, రాధ జంటగా నటించిన ఆ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత ఇదే సినిమా కన్నడలో అంబరీష్ హీరోగా ‘నమ్మూర హమ్మీర’ గా విడుదలై.. అక్కడా ఘనవిజయం సాధించింది.