వీడు ఆరడుల బుల్లెట్టూ.. ధైర్యం విసిరిన రాకెట్టూ అనే పాటకి తగ్గట్టుగానే ఉంటుంది పవన్‌కల్యాణ్ ఆలోచనలు. ఎవరికీ భయపడకుండా, నిజాయతీగా వేసే ఆయన అడుగులు యువతరానికి స్ఫూర్తిదాయకం. చిరంజీవి నటవారసుడిగా టాలీవుడ్ కు పరిచయం అయినా.. ఆ పరపతిని కేవలం తన ఎంట్రీ కోసమే ఉపయోగించుకున్నారు. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ అంతంత మాత్రంగానే ఆడినప్పటికీ పవన్‌కల్యాణ్ మాత్రం ప్రేక్షకులకు బాగా నచ్చారు. ముఖ్యంగా ఆయన ప్రదర్శించే మార్షల్ ఆర్ట్స్, సాహపోతమైన విన్యాసాలు అబ్బురపరిచాయి. అందుకే ఆయన సొంతంగా, డూప్ లేకుండా ఫైట్లు చేయడానికి ఇష్టపడతారు. కొన్ని చిత్రాలకి సొంతంగానే పోరాట ఘట్టాల్ని కంపోజ్ చేసుకుంటుంటారు. ‘గోకులంలో సీత’, ‘తొలి ప్రేమ’, ‘తమ్ముడు’, ‘సుస్వాగతం’, ‘బద్రి’, ‘ఖుషి’ చిత్రాలతో ఆయన రేంజ్ పెరిగిపోయింది. ప్రేక్షకుల్లో ఆయన ఆయన ఇమేజ్ స్కై హై కెళ్ళిపోయింది. ‘జల్సా’, ‘గబ్బర్ సింగ్’ చిత్రాలతో ఆయన రికార్డులు సృష్టించారు. ‘అత్తారింటికి దారేది’ చిత్రం వసూళ్ళలో అప్పటి వరకు తెలుగు సినీపరిశ్రమలో ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. ‘గోపాల గోపాల’ చిత్రంలో మోడరన్ కృష్ణుడిగా అదరగొట్టారు. ‘జానీ’తో దర్శకుడిగా కూడా మారారు. నిర్మాణంలోనూ ఆయనకి పట్టుంది. పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై ‘గబ్బర్‌సింగ్’, ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రాలు చేశారు. అతి పిన్న వయసులోనే దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన కథానాయకులలో పవన్ కళ్యాణ్ ఒకరు. అలాగే తన చిత్రాలకి, అన్న చిరంజీవి నటించిన చాలా చిత్రాలకు పవన్ కల్యాణ్ ఫైట్లని రూపొందించారు. తమ్ముడు చిత్రంలో లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్ పాటను పూర్తి స్థాయి ఇంగ్లీష్ గీతం,. ‘బద్రి’ లో మేరా దేశ్ హై ప్యారా ప్యారా తెలుగు, హిందీ, ఇంగ్లిష్ త్రిభాషా గీతంగా, ‘ఖుషి’లో యే మేరా జహాన్ గీతాన్ని పూర్తిస్థాయి హిందీ గీతంగా రూపొందించారు. ఇవన్నీ పవన్‌కల్యాణ్ ఆలోచనలతో రూపుదిద్దుకొన్నవే. ‘ఖుషి’ లో ఆడువారి మాటలకు అర్థాలే వేరులే…, ‘జానీ’ చిత్రంలో ఈ రేయి తీయనిదీ… పాటలని రీ-మిక్స్ చేయించారు. సంగీతంలో మంచి అభిరుచిని ప్రదర్శిస్తుంటారు పవన్. ‘అత్తారింటికి దారేది’, ‘అజ్ఞాతవాసి’ చిత్రాలలో పాటల్ని కూడా ఆలపించారు. పవన్ కల్యాణ్ తన చిత్రాలలో కనీసం ఒక్క జానపద గీతమైనా ఉండేలా ప్రయత్నాలు చేస్తుంటారు. కథానాయకుడిగా 25 చిత్రాలు చేసిన, మాస్ ప్రేక్షకుల్లో మంచి అభిమానాన్ని సంపాదించిన పవన్‌కల్యాణ్ 2014 మార్చి 14న జనసేన రాజకీయ పార్టీ ఆవిర్భావం జరిగింది. కుల, మత, ప్రాంతీయ పక్షపాతాలు లేకుండా జాతి సమైక్యతకు సమగ్రతకు పాటుపడడానికి పార్టీ స్థాపించారు ఆయన. నేడు పవన్‌కల్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్. హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్ .