విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు .. సినీ కెరీర్ కు బిగినింగ్ లోనే గట్టి పునాది వేసిన  చిత్రం ‘పల్లెటూరి పిల్ల’.  బిఏ సుబ్బారావు కు దర్శకుడిగా అదే తొలి చిత్రం. శోభనాచల పతాకంపై రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 27, 1950లో విడుదలై.. సరిగ్గా నేటికి 70 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఆంగ్ల నాటకం ‘పిజారో’ ఆధారంగా తెరకెక్కిన ‘పల్లెటూరి పిల్ల’ చిత్రం యన్టీఆర్, ఏఎన్నార్ హీరోలుగా కలిసి నటించిన తొలి చిత్రంగా ప్రత్యేకతను సంతరించుకుంది. అలాగే సంగీత దర్శకుడిగా ఆదినారాయణ రావుకు అదే తొలి చిత్రం.

యన్టీఆర్ ‘మనదేశం’ చిత్రంతో తెరగేంట్రం చేసినా, హీరోగా మొదటి సినిమా మాత్రం పల్లెటూరి పిల్లే. ధీరోదాత్తుడైన జయంత్ పాత్రను అద్భుతంగా పోషించారాయన. కోడె దూడతో పోట్లాడే సన్నివేశాన్ని డూప్ లేకుండా చేయటంతో యన్టీఆర్ మణికట్టు విరగింది. అంజలీదేవితో చెంప దెబ్బతినే సీను చిత్రీకరణలో ఎక్కువ టేకులు తీసుకొని చెంప ఎర్రగా కందిపోయినా ఓపికతో యన్టీఆర్ నటించడం విశేషం. త్యాగధనుడు వసంత్‌గా అక్కినేని నటన ప్రేక్షకుల ప్రశంసలనందుకుంది. యన్టీఆర్, అక్కినేనిల సరసన శాంతిగా అంజలిదేవి నటన అపూర్వం. అక్కినేని పాత్రకు మొదట రఘురామయ్యను బుక్‌చేశారు. అయితే రఘురామయ్యకు ఫైట్స్ చేయటంలో అంత అనుభవం లేకపోవటంతో ఆయన్ని తొలగించి అక్కినేనిని తీసుకున్నారు. విలన్ పాత్రకూ మొదట యస్వీఆర్‌ని తీసుకున్నారు. ఆ టైంలో ఆయన తండ్రి మరణించటంతో ఆ వేషం మరొకరికి వెళ్లింది. అయితే అంజలిదేవి తాతగా యస్వీఆర్ కనిపిస్తారు. హీరోగా యన్టీఆర్ కెరీర్ కు దిశా నిర్దేశం చేసిన ‘పల్లెటూరి పిల్ల’ చిత్రం ఆయనకు ఎప్పటికీ ప్రత్యేకమే.

Leave a comment

error: Content is protected !!