విశ్వవిఖ్యాత నటసార్వభౌమ డా. యన్టీఆర్ నటించిన పౌరాణిక చిత్రాల్లో ‘దీపావళి’ చాలా ప్రత్యేకమైంది. ఇందులో ఆయన శ్రీకృష్ణుడిగా నటించారు. ఆ పాత్ర పోషించడం అప్పటికి మూడోసారి. సావిత్రి సత్యభామగా నటించిన ఈ సినిమాలో .. సరకాసురుడిగా యస్వీఆర్ అనితర సాధ్యంగా నటించారు. ఇంకా కృష్ణకుమారి, కాంతారావు, రమణారెడ్డి , గుమ్మడి, యస్.వరలక్ష్మి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. అశ్వరాజా పిక్చర్స్ బ్యానర్ పై కె.గోపాలరావు నిర్మాణంలో యస్. రజనీకాంత్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. 1960, సెప్టెంబర్ 22న విడుదలైన ఈ సినిమా నేటికి సరిగ్గా 60 ఏళ్ళు పూర్తి చేసుకుంది.
విష్ణుమూర్తి వరాహావతారం ధరించినప్పుడు భూదేవికి , విష్ణుమూర్తికి జన్మిస్తాడు నరకాసురుడు. ఈ ప్రపంచాన్నంతటినీ జయించి ప్రక్జోతిష పురాన్ని రాజధాని గా చేసుకుంటాడు నరకాసురుడు. అప్పుడు స్వర్గాన్ని కూడా జయించాలనుకున్న నరకాసురుడికి శివుడు అతడికి, ఒక్క భూదేవి తప్ప మరెవరూ చంపలేని విధంగా వరాన్ని ప్రసాదిస్తాడు. అప్పుడతడు విశ్వాన్నంతటినీ జయించి.. దేవతల్ని , మునుల్ని నానా హింసలకి గురిచేస్తూ అరాచకం సృష్టిస్తుంటాడు. ఆఖరికి అందరు దేవతల కోరిక మేరకు సత్యభామ రూపంలో ఉన్న భూదేవి .. నరకాసుర సంహారాన్ని సాగించడంతో .. ప్రజలు హర్షాతిరేకాలతో సంబరాలు జరుపుకుని బాణా సంచా కాల్చుకుంటారు. దాన్నే దీపావళి పండుగగా వ్యవహరిస్తున్నారు. అప్పట్లో ఘనవిజయం సాధించిన ఈ సినిమా శతదినోత్సవాన్ని జరుపుకుంది. అంతేకాదు.. ఈ సినిమా విడుదలైన ఆరు రోజులకు యన్టీఆర్ నటించిన భట్టి విక్రమార్క సినిమా విడుదలై..అది కూడా శతదినోత్సవాన్ని పూర్తి చేసుకోవడం విశేషం.