కరోనా వైరస్ ఇప్పుడు 195 దేశాలకు పైగా వ్యాపించి ఇప్పుడు ఇండియాలోనూ తిష్టవేసుకు కూర్చున్న సంగతి తెలిసిందే. దాంతో ఈ వైరస్ ని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ శక్తికి మించి ప్రయత్నిస్తున్నాయి. ఇక భారత ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్డౌన్ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకి చిత్ర పరిశ్రమలోని సినీ ప్రముఖులు అండగా నిలుస్తున్నారు.. ఇప్పటికే చాలా మంది హీరోలు తమ వంతుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సాయం అందిస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కార్మికులకు పని లేకుండా పోయింది. దీంతో వారిని ఆదుకోవడం కోసం సినీ ఇండస్ట్రీ కరోనా క్రైసిస్ ఛారిటీ ఏర్పాటు చేసారు.
ఇందులో భాగంగా ప్రముఖ నటుడు బ్రహ్మాజీ రూ. 75 వేలు ఆర్ధిక సాయం అందించారు. మరోవైపు ఆయన కుమారుడు పిట్టకథ ఫేమ్ సంజయ్..రూ.25 వేలు సాయం అందించారు. మొత్తానికి పెద్ద హీరోల స్థాయిలో కాకపోయినా.. ఉన్నంతలో కరోనా బాధితుల కోసం రూ. 1లక్ష వరకు సాయం ప్రకటించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు.