నటసింహ నందమూరి బాలకృష్ణ కెరీర్ లో మరపురాని కుటుంబ కథా చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. యువ చిత్ర బ్యానర్ పై ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో కె.మురారి నిర్మించిన ఈ సినిమా 1990, ఏప్రిల్ 27న విడుదలై ఘన విజయం సాధించింది. నేటికి సరిగ్గా 30 ఏళ్ళు పూర్తి చేసుకుంది ఈ సినిమా. మామ మహదేవన్ సంగీత సారధ్యంలోని అద్భుతమైన పాటలు ఇప్పటికీ సంగీత ప్రియుల్ని అలరిస్తునే ఉన్నాయి. బాలయ్య 50 వ సినిమాగా విశేషాన్ని సంతరించుకున్నఈ సినిమా శోభన, నిరోషా కథానాయికలుగా నటించగా.. శారద, కైకాల సత్యనారాయణ, తనికెళ్ల భరణి, అనంత్, ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. బాలయ్య సినీ కెరీర్ లో ఒక్క ఫైట్ కూడా లేకుండా.. పక్కా ఫ్యామిలీ మూవీగా ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం చరిత్రలో నిలిచిపోయింది.

అహంకారం , డబ్బు మదం తలకెక్కిన  అత్తకు బుద్ధి చెప్పే .. అల్లుడిగా బాలయ్య నటన అమోఘం. అలాగే..  బావని ఆటపట్టించే చిలిపి మరదళ్ళుగా నటించిన  శోభన,  నిరోషాల గ్లామర్ దానికి మరింత ప్లస్ అయింది. ఆచార్య ఆత్రేయ, వేటూరి , సిరివెన్నెల పాటలు, తనికెళ్ల భరణి, భమిడిపాటి రాధాకృష్ణ, జి.సత్యమూర్తి, వినాయక శర్మ మాటలు నారీ నారీ నడుమ మురారి చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలు.  ఎప్పుడూ సాఫ్ట్ కేరక్టర్స్ పోషిస్తూ.. ఉత్తమమైన తల్లి పాత్రలు పోషించే శారద ఈ సినిమాలో మాత్రం  అహంకారపు అత్తగా అదరగొట్టేసింది. అంతకు ముందు ఆమె అలాంటి పాత్రలు పోషించకపోవడం వల్ల..  శారదకు ఈ సినిమాతో చాలా మంచి పేరొచ్చింది. 

 

Leave a comment

error: Content is protected !!