Shopping Cart 0 items - $0.00 0

‘అల వైకుంఠపురములో’ రివ్యూ

 

చిత్రం : ‘అల వైకుంఠపురములో’

నటీనటులు : అల్లు అర్జున్, పూజాహెగ్డే , టబు, జయరాం, మురళీ శర్మ, సచిన్ ఖేడ్కర్ , సముద్ర ఖని, అజయ్, బ్రహ్మాజీ, సుశాంత్, హరితేజ, వెన్నెల కిశోర్, రోహిణి, నివేదా పెతురాజ్, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, హర్ష వర్ధన్, తణికెళ్ళ భరణి, సునీల్ తదితరులు

సంగీతం : యస్.యస్. తమన్

ఛాయాగ్రహణం : పి.యస్. వినోద్

నిర్మాత : అల్లు అరవింద్, యస్.రాధా కృష్ణ

బ్యానర్ : గీతా ఆర్ట్స్ , హారిక అండ్ హాసిని క్రియేషన్స్

రచన, దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్

‘నా పేరు సూర్య’ సినిమాతో ఫ్లాప్ దెబ్బతిన్న అల్లు అర్జున్ కాస్తంత గ్యాప్ తీసుకొని  విక్రమ్ కుమార్ తో ముందుగా అనుకున్న సినిమాను పక్కనపెట్టి మరీ  ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’  లాంటి విజయాలు అందించిన త్రివిక్రమ్ తో ఏరికోరి మరీ ‘అల వైకుంఠ పురములో’ చిత్రం  చేయడానికి ముందుకు రావడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ‘అజ్నాతవాసి’ తో చేదు అనుభవాన్ని చవిచూసినా..  త్రివిక్రమ్ బ్రిలియన్సీని అల్లు అర్జున్  హండ్రెడ్ పర్సెంట్ నమ్ముకున్నాడు. ఈ సినిమాతో మరిచిపోలేని హిట్టు సాధించి మళ్ళీ ఫామ్ లోకి రావాలనుకున్నాడు. ఇంతకీ త్రివిక్రమ్ బన్నీ నమ్మకాన్ని ఎంతవరకూ నిలబెట్టాడో చూద్దాం..   

కథ :

వాల్మీకి (మురళీ శర్మ )..  తన కళ్ళ ముందే మల్టీ మిలియనీర్ గా ఎదిగిన తన కొలీగ్  రామచంద్ర (జయరామ్ ) దగ్గర ఉద్యోగి. ఇద్దరి భార్యలూ ఒకేసారి ప్రసవిస్తారు. అయితే కొన్ని పరిస్థితుల వల్ల మురళీ శర్మ బిడ్డల్ని తారుమారు చేస్తాడు. అది తెలిసిన నర్స్ కోమాలోకి వెళ్లిపోతుంది. తన బిడ్డ మిలీయనీర్ ఇంట పెరుగుతూండడాన్ని ఎంజాయ్ చేస్తూ.. రామచంద్ర బిడ్డకి బంటు (బన్నీ)  అని పేరు పెట్టి  తన శాడిజాన్ని   చూపిస్తూ.. తన చెప్పుచేతల్లో పెట్టుకొని అతడికి స్వేచ్ఛ అంటూ లేకుండా చేస్తాడు. మరో పక్క రామచంద్ర కు , అతడి భార్య కు మధ్య ఇగో క్లాషెస్ వచ్చి ఎడమొగం పెడమొగంగా ఉంటారు. అలాంటి పరిస్థితుల్లోనే సముద్రఖని, అతడి కొడుకు ఆ ఇంట్లో ఒక సమస్య సృష్టిస్తారు. మారు కొడుకు సుశాంత్ (రాజ్ ) అశక్తుడవుతాడు.  అంతలో కోమాలోకి వెళ్లిపోయిన నర్స్ వల్ల తన తల్లితండ్రులెవరో తెలుసుకుని ‘వైకుంఠపురము’ అనే ఆ ఇంట్లోకి అడుగుపెడాతాడు. మరి అతడు ఆ ఇంటిని చక్కదిద్ది.. ఆ రహస్యాన్ని ఎలా  రివీల్ చేస్తాడు?  కథను కంచికెలా చేరుస్తాడు అన్న అంశాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథనం , విశ్లేషణ :

తెలుగులో ఫ్యామీలీ మూవీస్ కు ఒక ఒరవడిని, ఒక స్టైల్ ను క్రియేట్ చేసిన దర్శకుడు త్రివిక్రమ్. ఎలాంటి కథనైనా వినోదంతో రంగరించి.. వెండితెరమీద కుమ్మరించడం అతడికి వెన్నతో పెట్టిన విద్య.  గతంలో ఆయన  రాసిన  కథలతో వచ్చిన చిత్రాలు ,  తెరకెక్కించిన సినిమాలే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ . అయితే ఒక దశ దాటాకా..  ఆయన కూడా మూసలో కొట్టుకుపోయి..కొన్ని  సినిమాలు  ప్రేక్షకుల అసహనానికి గురయ్యాయి. ‘అజ్నాత వాసి’ మూవీ దానికి పరాకాష్టగా నిలిచింది.  అందుకే ఈ సినిమాను కూడా అదే కేటగిరిలో కలిపేసి.. పెద్దగా హోప్స్ పెట్టుకోలేదు  . కానీ త్రివిక్రమ్  తనలో బ్రిలియన్సీ ఏ మాత్రం తగ్గలేదని.. తను మనసు పెడితే..  ఒక  సినిమాని ఎంత క్లాస్ గా,  ఎంత చక్కగా తెరకెక్కించగలడో  ఈ సినిమాతో నిరూపించాడు. ఆయన భాషలోనే చెప్పాలంటే..  ‘అల వైకుంఠపురములో’  సినిమా ని  ఏదో గోడ కడుతున్నట్టు, గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్టు .. చాలా శ్రద్ధగా తెరకెక్కించాడు త్రివిక్రమ్.  ఎట్ ది సేమ్ టైమ్ ‘అజ్నాతవాసి’ లో  ఏఏ  అంశాల్ని లైట్ తీసుకొన్నాడో .. ఆయా అంశాల్ని పక్కాగా,  పెర్ఫెక్ట్ గా,   డీటెయిల్డ్ గా చెప్పే ప్రయత్నం చేశాడు. అందులో నూటికి నూరు శాతం సక్సెస్ సాధించాడు.  త్రివిక్రమ్ ప్రధాన బలం డైలాగ్స్ . చమత్కారంగా ఉంటూ.. వాస్తవమే కదా అనిపించే ఆయన స్టైల్ ఆఫ్ డైలాగ్స్ ను  కొంత కాలంగా మిస్సయ్యారు జనం . ఆ లోటు ను కూడా ఈ సినిమాతో పూర్తిగా తీర్చేశాడు ఆయన. ఏదో క్లాస్ పీకుతున్నట్టు కాకుండా.. ప్రాసలతో లాగించకుండా..  ఒక స్టైల్ లో రాశాడు. అవన్నీ సినిమాల్లో పెర్ఫెక్ట్ గా పేలాయి. 

ఫస్టాఫ్ లో ఎంత మోతాదులో  కామెడీ ఉంటుందో.. సెకండాఫ్ లోనూ అంతే మోతాదులో వినోదాన్ని అందించాడు త్రివిక్రమ్. ముఖ్యంగా బన్నీ వైకుంఠపురములోకి అడుగుపెట్టిన తర్వాత వచ్చే సీన్స్ అన్నీ చాలా ఆసక్తిని కలిగిస్తాయి.   ఇక ఈ సినిమాలోని ప్రత్యేకతలు ఏంటంటే..  బిల్డప్పులు, ఎలివేషన్స్ తో నిండిపోయే  హీరోయిజం ప్లేస్ లోకి స్టైలిష్ హీరో ప్రెజెంటేషన్ చోటు చేసుకుంది. అది ఈ సినిమాలో ఎంత అద్భుతంగా కుదిరిందంటే ..  బన్నీ నటించిన సినిమా లన్నిటిలోనూ ఈ సినిమాలోనే  ది బెస్ట్ అనిపించేలా ఉన్నాయి.  ఏదో  ఇరికిచినట్టుగా కాకుండా.. సిట్యూవేషన్ కు  తగ్గట్టుగానే ఇందులోని అన్ని  సీన్స్ చాలా వినోదాన్ని అందిస్తాయి.  ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోలందరి  సూపర్ హిట్ సాంగ్స్  కు బన్నీ డ్యాన్స్ చేయడం ఈ సినిమాకే హైలైట్ .  బన్నీ స్ర్కీన్ మీద కనిపించే అన్ని సీన్స్  ఆద్యంతం చాలా ఆసక్తికరంగా, వినోదాత్మకంగా సాగుతాయి.  ఇంకా పూజా హెగ్డే తో బన్నీ లవ్ ట్రాక్, వెన్నెల కిషోర్  ఎపిసోడ్స్, హర్షవర్దన్, సునీల్ కామెడీ, మురళీ శర్మకి, బన్నీ కి మధ్య నడిచే సన్నివేశాలూ  ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తుతాయి.  ఇక ఈ సినిమాకి మరో ప్రదాన బలం ఎమోషన్స్.  జయరాం, టబు మధ్య నడిచే ఎమోషనల్ సీన్స్  చాలా హృద్యంగా ఉంటాయి.  ఇక  సముద్రఖని బృందంతో బన్నీ చేసే ఫైట్ ను ఒక జానపద పాట మీద చిత్రీకరించి.. ఆ పాటలో లిరిక్స్ కు తగ్గట్టుగానే కంపోజ్ చేశారు. అది సినిమాలో పెర్ఫెక్ట్ గా కుదిరింది.   ఇక  క్లైమాక్స్ సీన్  ను  రొటీన్ గా కాకుండా చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశాడు దర్శకుడు . మొత్తం మీద ఈ సినిమా కథాంశం సింపులే అయినా.. కథనంతో త్రివిక్రమ్ కట్టిపడేస్తాడు.  

నటీ నటుల పెర్ఫార్మెన్స్ :

అల్లు అర్జున్ ఆద్యంతం తన నటనతో , కామెడీ టైమింగ్ తో , స్టైల్ తో అదరగొట్టేశాడు. అలాగే ఫైట్స్ లోనూ, డ్యాన్స్ లోనూ ఇరగదీసేశాడు.  పూజా హెగ్డే  పెర్ఫార్మెన్స్ , గ్లామర్ సినిమాకి అదనపు ఆకర్షణ. ఇక  ఈ సినిమాలో చెప్పుకోదగ్గ స్థాయిలో తన నటనతో ఆకట్టుకున్న నటుడు మురళీ శర్మే అని చెప్పుకోవాలి. ఒక ప్రత్యేకమైన మేనరిజమ్ తో, మధ్యతరగతి తండ్రి గెటప్ లో ఆయన పండించిన కామెడీ భలేగా అనిపిస్తుంది.  ఇక రామచంద్రగా జయరామ్ పాత్ర కూడా చాలా హుందాగా ఉంటుంది. అలాగే టబు పాత్ర కూడా ఉన్నంతలో బాగానే మెప్పిస్తుంది. ఇక టబు తండ్రిగా నటించిన సచిన్ ఖేడ్కర్ కూడా బాగా పెర్ఫార్మ్ చేశాడు. సుశాంత్ పాత్ర కు డైలాగ్స్ తక్కువ, కనిపించేది ఎక్కువ  అవడం ఆశ్చర్యపరుస్తుంది.  అసలీ సినిమాను ఆయన ఎందుకు ఒప్పుకున్నాడో అనిపిస్తుంది. అలాగే నివేదా పెతురాజ్, సునీల్ పాత్రలు కూడా సినిమాలో నామ్ కహా అనిస్తాయి. ఇక విలన్ గా నటించిన సముద్ర ఖని, అతడి కొడుకు గా నటించిన జీపీ పర్వాలేదనిపిస్తారు. అలాగే వెన్నెల కిషోర్ , రాజేంద్రప్రసాద్ పాత్రలు సినిమాలో చాలా తక్కువ కనిపిస్తాయి.

సాంకేతిక వర్గం :

తమన్ సంగీతం ఈ సినిమాకి పక్కాగా కుదిరింది.  యూట్యూబ్ లో  రికార్డు వ్యూస్ తెచ్చుకున్న పాటలు .. సినిమాలో కూడా అంతే స్థాయిలో ప్రేక్షకుల్ని మెప్పిస్తాయి. బుట్టబొమ్మ , రాములో రాములా సామజవరగమన పాటలు  , అందులో బన్నీ స్టెప్స్ అభిమానుల్ని ఎంతగానో అలరిస్తాయి. ఇక పి.యస్.వినోద్ కెమేరా పనితనం ప్రతీ ఫ్రేమ్ లోనూ మనకి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎంట్రీ లో వచ్చే బన్నీ ఫైట్ సీన్ చాలా  స్టైలిష్ గా , అందంగా కుదిరింది. దానికితోడు  స్టంట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ కంపోజింగ్ అద్భుతంగా కుదిరింది. మొత్తం మీద ‘అల వైకుంఠపురములో’ సినిమాతో  త్రివిక్రమ్ తన దర్శకత్వ ప్రతిభను, సంభాషణా చాతుర్యాన్ని మరోసారి చాటుకుని,  అభిమానుల్ని  ఈ సంక్రాంతికి వినోదాల జల్లులో ముంచితేల్చాడని చెప్పుకోవచ్చు. 

రేటింగ్ : 3.5

బోటమ్ లైన్ : వినోదాల వైకుంఠపురం

 review by : రామకృష్ణ క్రొవ్విడి 

 

Leave a comment

error: Content is protected !!