టాలీవుడ్ లో ఎన్నో ప్రేమ కథా చిత్రాలొచ్చాయి. జనాన్ని మెప్పించాయి. కానీ మెచ్యూర్డ్ లవ్ స్టోరీస్ మాత్రం చాలా అరుదుగా వచ్చాయి. అలాంటి ఓ అద్భుతమైన చిత్రమే ‘నువ్వే కావాలి’. ఉషాకిరణ్ మూవీస్ వారి ‘మనసు మమత’ చిత్రంతో బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన తరుణ్ .. అదే బ్యానర్ లో ‘నువ్వే కావాలి’ చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇవ్వడం విశేషం. 2000, అక్టోబర్ 13న విడుదలైన ఈ సినిమా సరిగ్గా నేటికి 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది.
ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ తో స్రవంతి మూవీస్ కూడా నిర్మాణ భాగస్వామ్యం వహించిన ఈ సినిమాకి కే.విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. సురేశ్ హీరోగా నటించిన ‘ప్రార్ధన’ చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ భాస్కర్ కు ఆ సినిమా రిజల్డ్ తీవ్ర నిరాశను కలిగించింది. అతడ్నితిరిగి దర్శకుడిగా నిలబెట్టిన చిత్రం స్వయం వరం. ఆ సినిమా విజయంలో ప్రధాన భూమిక పోషించిన మాటల రచయిత త్రివిక్రమ్ చేతనే ‘నువ్వే కావాలి’ చిత్రానికి డైలాగ్స్ రాయించి మరోసారి అద్భుతాలు సాధించారు. ‘నువ్వే కావాలి’ అప్పటి కుర్రకారును పదే పదే థియేటర్స్ కు రప్పించిన చిత్రంగా చరిత్రలో నిలిచిపోయింది. కోటి సంగీత సారధ్యంలోని పాటలన్నీ సూపర్ హిట్. అందులో ముఖ్యం గా ఎక్కడ ఉన్నా పక్కననువ్వే ఉన్నట్టుంటుంది, కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, అనగనగా ఆకాశం ఉంది.. పాటలు యూత్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
నిజానికి ఈ సినిమా ‘నిరం’ (రంగు) అనే మలయాళ మూవీకి రీమేక్. కుంజాక్కో బోబన్, షాలినీ జంటగా నటించిన ఈ సినిమా మాలీవుడ్ లో రికార్డు కలెక్షన్స్ కురిపించింది. ఆ తర్వాత ఇదే సినిమా తమిళంలో ప్రశాంత్ హీరోగా ‘పిరియాద వరం వేండుమ్’ (విడిపోని వరం కావాలి) గానూ, కన్నడలో నినగాగి (నీకోసం) గానూ, హిందీలో ‘తుఝే మేరీ కసమ్’ గానూ రీమేక్ అయి ఆయా భాషల్లో కూడా ఘన విజయం సాధించింది.