అనుష్క కెరీర్ ను మలుపు తిప్పిన చిత్రం అరుంధతి. కమర్షియల్ హీరో స్థాయి ఇమేజ్ అనుష్కు కల్పించిన చిత్రం అరుంధతి. తెలుగు సినిమాకు గ్రాఫిక్స్ మాయాజాలం చూపించిన దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన మూవీ అరుంధతి. వదల బొమ్మాళి అంటూ సోనూసూద్ పశుపతిగా చేసిన అద్భుతమైన విధ్వంస విన్యాసం తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. సోనూసూద్ కి నంది అవార్డ్ కూడా తెచ్చిపెట్టింది. అలా ఒకటేమిటి ఒకేసారి 7 నంది అవార్డులు సాధించిన చిత్రం అరుంధతి. “అరుంధతి, జేజెమ్మ” పాత్రలలో అనుష్క కనబరిచిన అద్భుత అభినయం ఆబాలగోపాలాన్ని అలరించింది. రాజీ పడడం అన్నది ఎరుగని సుప్రసిద్ధ నిర్మాత ఎం.శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి నేటి రాజమౌళి ఆస్థాన ఛాయాగ్రాహకుడు కె.సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా… కోటి సంగీతం సమకూర్చారు. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటర్.”అరుంధతి” సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఇదే రోజూ జనవరి 16, 2009లో విడుదలై, తెలుగు సినిమా చరిత్రలో ఎన్నటికీ చెరగని ముద్ర వేసింది.