ఒకప్పుడు మన తెలుగు సినిమాలు శతదినోత్సవాలు జరుపుకొనేవి. వందరోజులు  పూర్తయినా సరే.. ప్రేక్షకులతో థియేటర్స్  కిటకిటలాడిపోయేవి. కానీ ఇప్పుడు ఒక పెద్ద సినిమా  గట్టి గా పదిరోజులు ఆడితే అదే పెద్ద రికార్డ్. ఆ వ్యవధిలోనే వీలైనంత కలెక్షన్స్ దండుకొనే ప్రయత్నంలో భాగంగా మామూలు థియేటర్స్ తో పాటు మల్టీప్లెక్స్ వచ్చిపడ్డాయి. దాంతో పాటు ప్రతీ గ్రామంలోని డొక్కు థియేటర్స్ లో సైతం సినిమాలు విడులవుతున్నాయి. ఆ క్రమంలోనే థియేటర్స్ సంఖ్య ఓ రేంజ్ లో పెరిగిపోయాయి. అయితే .. గత మూడు నెలలుగా ఆ థియేటర్స్ అన్నీ మూతపడ్డాయి. దానికి కారణం కరోనా వైరస్ అని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. లాక్ డౌన్ లో భాగంగా సినిమాల షూటింగ్స్ కు గండిపడింది. దాంతో థియేటర్స్ మూతపడ్డాయి.

మార్చ్ 23న ప్రారంభమైన లాక్ డౌన్ ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతూ.. నేటికి వందరోజులు పూర్తి చేసుకుంది. ఒకప్పుడు థియేటర్స్ కళకళలాడినప్పుడు శతదినోత్సవాలు జరిగితే.. ఇప్పుడు మూత బడిన సినిమా హాళ్ళు .. శతదినాలు పూర్తి చేసుకోవడం విడ్డూరంగా మారింది. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగితే..  గతంలో సినిమాలు థియేటర్స్ లో ప్రదర్శింపబడేవి అని ఆశ్చర్యంగా చెప్పుకునే పరిస్థితులు ఎదురవుతాయేమో.. ఏదేమైనప్పటికీ.. ఈ కరోనా వైరస్ నుంచి ప్రజలు తొందర్లోనే విముక్తి అయితే.. . మళ్ళీ జనంతో థియేటర్స్ కళకళలాడతాయి. ఆ రోజులు  తొందర్లోనే రావాలని  కోరుకుందాం…

Leave a comment

error: Content is protected !!