వచ్చీరాగానే టాలీవుడ్ వెండితెరపై ఓ యువ కిరణం తళుక్కున మెరిపింది. తొలి చిత్రానికే విజయం ముంగిటవాలింది. అవకాశాలు వెంటబడ్డాయి. పలు చిత్రాలు తెరకెక్కాయి. హీరోగా పేరు మారుమోగిపోయింది. అయితే అంతలోనే ఆ ప్రయాణం అర్ధంతరంగా ముగిసింది. ఆ నటుడి పేరు ఉదయ్ కిరణ్. టాలీవుడ్ లో ఎలాంటి గాడ్ ఫాదర్స్ లేకుండా.. హీరోగా ప్రవేశించి.. జయాపజయాలకు తట్టుకొని నిలబడ్డాడు. అయినా సరే.. ఒకానొక బలహీనమైన క్షణం అతడి మానసిక పరిస్థితిపై తీవ్రంగా ప్రభావం చూపింది. ఫలితంగా ఓ మంచి నటుడ్ని టాలీవుడ్ శాశ్వతంగా కోల్పోయింది.
1980లో హైదరాబాద్‌లో జన్మించారు ఉదయ్ కిరణ్. సికింద్రాబాద్ వెస్లీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. కాలేజీ నుంచే మోడలింగ్ మొదలుపెట్టిన ఆయన తేజ దృష్టిలో పడి ఉషాకిరణ్ మూవీస్ వారి ‘‘చిత్రం’’ లో నటించే అవకాశాన్ని అందుకొన్నాడు. ‘నువ్వు నేను’ చిత్రంలో నటనకిగానూ ఆయన ఉత్తమ నటుడుగా ఫిల్మ్ ఫేర్ పురస్కారం లభించింది. ‘నీ స్నేహం’, ‘శ్రీరామ్’ చిత్రాల్లో ఉదయ్‌కిరణ్ నటనకి ప్రశంసలు లభించాయి. తెలుగుతోపాటు తమిళంలోనూ నటించారు ఉదయ్‌కిరణ్. కె.బాలచందర్ దర్శకత్వంలో ‘పొయ్’తో ‘వంబు సండై’, ‘పెన్ సింగమ్’ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. 2012లో విషితతో ఆయన వివాహం జరిగింది. వరుస పరాజయాలు… ఆర్థిక ఇబ్బందులతో మానసిక ఆందోళనకి గురైన ఉదయ్‌కిరణ్ 2014లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నారు. ఆయన మరణం చిత్ర పరిశ్రమలోనూ, అభిమానుల్లోనూ తీవ్ర విషాదాన్ని నింపింది. ఎంతో ఎత్తుకు ఎదుగుతాడనుకొన్న ఉదయ్‌కిరణ్ 33 సంవత్సరాల వయసులోనే తనువు చాలించి అందరినీ శోకసంద్రంలో ముంచెత్తారు. నేడు ఉదయకిరణ్ వర్ధంతి. ఈ సందర్బంగా ఆయనకి ఘననివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.