టాలీవుడ్ లో ముందు నుంచీ హాస్య నటీమణులు చాలా తక్కువ. సందర్భానుసారంగా సన్నివేశాల్లో చాలా మంది హీరోయిన్స్, ఇతర స్త్రీ పాత్రధారులు హాస్యం పండించినా.. లేడీ కమెడియన్స్ అని పర్టిక్యులర్ గా లేరు. అయితే రమాప్రభ రాకతో .. ఆ కొరత తీరింది. ఎన్నో సినిమాల్లో ఆమె పద్మనాభం, రాజబాబు, అల్లు రామలింగయ్య, లాంటి టాప్ మోస్ట్ కమెడియన్స్ కి జోడీగా నటించి.. తాను అలాంటి పాత్రలకు చాలా ప్రత్యేకం అని నిరూపించుకున్నారు. అంతేకాదు.. ఆమె మీద ఎన్నో ప్రత్యేక పాటలు కూడా చిత్రీకరించేవారు దర్శకులు.
14 సంవత్సరాల వయసులో తమిళ సినిమా ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత ‘చిలకా గోరింకా’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఆ తరువాత నుంచి ఇప్పటివరకు వరుసగా సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. సినిమాల్లోకి రాకముందు రమాప్రభ నాటకాలలో నటించారు. నటన అంటే రమాప్రభకు ఎంతో ఇష్టం. ఎంత పెద్ద డైలాగు చెప్పినా రమాప్రభ ఎంతో సులభంగా చెప్పేవారు. రమాప్రభ షూటింగ్ టైంలో తోటి నటీనటులతో సరదాగా ఉండేవారు. సరదాగా, జాలీగా అందరితో స్నేహపూర్వకంగా మాట్లాడడం రమాప్రభకు అలవాటు. రమాప్రభ, రాజబాబుది అద్భుతమైన సినీ కెమిస్ట్రీ. వీళ్లిద్దరూ కలిసి రెండు, మూడు వందలకు పైగా సినిమాలలో నటించారు. రాజబాబుతో ఎంతో ఆత్మీయబంధం ఉంది రమాప్రభకు. అదే సమయంలో మరో హాస్య నటుడు పద్మనాభంతో కూడా పలు చిత్రాల్లో నటించిన అనుభవం ఆమెకి ఉంది. రమాప్రభ కాలంలో హీరోల పాత్రల్లో ఎంతో పెద్దవారు నటించేవారు. రమాప్రభ 14వ సంవత్సరంలోనే ఇండస్ట్రీలోకి వచ్చారు. ఈ కారణంగా రమాప్రభ హీరోయిన్ పాత్రలకు దూరమయ్యారు. రమాప్రభ హీరోయిన్ల పాత్రలకు దూరంగా ఉండడానికి మరొక కారణం కూడా ఉందట. హీరోయిన్ పాత్రలైతే, కేవలం అవి మాత్రమే వస్తాయని, అలాగే కొంతకాలానికే స్కీన్ కి దూరంగా ఉండాలని తెలిసినవారు రమాప్రభకు చెప్పారట. ఈ కారణంగా కూడా హీరోయిన్ పాత్రలకు దూరంగా ఉన్నారట రమాప్రభ. ‘సంబరాల రాంబాబు’, ‘అక్కా చెల్లెల్లు’, ‘బొమ్మ బొరుసా’, ‘విచిత్ర బంధం’, ‘తాతా మనవడు, ‘ఇద్దరు అమ్మాయిలు, ‘బడి పంతులు’, ‘ఓ సీత కథ’, ‘జీవన జ్యోతి’, ‘వింత ఇల్లు సంత గోల’, ‘సోగ్గాడు’, ‘సిరి సిరి మువ్వ’, ‘శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్’, ‘మనుషులంతా ఒక్కటే’, ‘అమర దీపం’, ‘అడవి రాముడు’, ‘దొంగల దోపిడీ’, ‘ప్రాణం ఖరీదు’ లాంటి సినిమాలు రమాప్రభ ప్రతిభకు మచ్చుతునకలు. నేడు రమాప్రభ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.