ఆయన పాట పరవశింపచేస్తుంది. స్వరం సరిగమల ఘుమఘుమలు వెదజల్లుతుంది. బాణీ అందమైన ఓణీ కట్టుకొని శ్రావ్యమైన పాటగా పరిమళిస్తుంది. ఒకటికాదు రెండు కాదు.. ఏకంగా 959 సినిమాలకు స్వరాలు కూర్చిన రాగాల రారాజు . పేరు చక్రవర్తి. ఆయన పాట పండితులతో పాటు.. పామరుల్ని అలరించింది. శాస్త్రీయ, జానపద, విప్లవ, భక్తి గీతాలకు సైతం అవలీలగా బాణీలు కూర్చే ప్రతిభ ఆయనది. ఒక్క సంగీత దర్శకుడిగానే కాకుండా.. డబ్బింగ్ ఆర్టిస్ట్ గానూ, గాయకుడిగానూ , నటుడిగానూ అసోసియేట్ దర్శకుడిగానూ ..ఇలా ఎన్నో రకాల శాఖల్ని నిర్వహించిన అనుభవం ఆయనది.
శోభన్ బాబు ‘మూగప్రేమ’ సినిమాతో సంగీత దర్శకుడిగా తన కెరీర్ ను మొదలు పెట్టిన చక్రవర్తి.. అతితక్కువ కాలంలోనే బిజీ సంగీత దర్శకుడు అయిపోయారు. ముఖ్యంగా 1982-88 మధ్య కాలంలో అద్భుతమైన అవకాశాలు చక్రవర్తి వెంట నడిచాయి. ముఖ్యంగా రెండవ ఇన్నింగ్స్ నడుపుతున్న ఎన్టీఆర్ చిత్రాలు ‘అన్నదమ్ముల అనుబంధం’, ‘యమగోల’, ‘అడవి రాముడు’, ‘డ్రైవర్ రాముడు’, ‘వేటగాడు’, ‘ఛాలెంజ్ రాముడు’ లాంటి చిత్రాలకు చక్రవర్తి అద్భుత సంగీతాన్ని సమకూర్చారు. మల్లెపువ్వు సినిమా కి అద్భుతమైన సంగీతం అందించారు. హిందీ మాతృక ‘ప్యాసా’ లో ఒక్క పాటను కూడా అనుకరించకుండా పాటలను చక్రవర్తి స్వరపరచిన విధానం ఎందరో నిర్మాతలు, దర్శకులకు స్పూర్తి దాయకమైంది. హీరో చిరంజీవి వేగానికి, జయమాలిని, జ్యోతిలక్ష్మిల డిస్కో చిందులకి, ఎన్టీఆర్ స్టెప్పులకి అనుగుణంగా చక్రవర్తి పాటలు స్వరపరచి సినిమాలు హిట్లయ్యేందుకు సహకరించారు. కేవలం వ్యాపార చిత్రాలకే కాకుండా మాదాల రంగారావు నిర్మించిన ‘ఎర్రమల్లెలు’, ‘విప్లవశంఖం’, ‘ప్రజారాజ్యం’ ‘మహాప్రస్థానం’. టి. కృష్ణ నిర్మించిన ‘నేటిభారతం’, ‘వందేమాతరం’, ‘రేపటి పౌరులు’ వంటి ప్రబోధాత్మక చిత్రాలకు కూడా అర్ధవంతమైన సంగీతాన్ని అందించడం చక్రవర్తి ప్రత్యేకత. ఆయనది అంతా సంచలనమే. ఒక గంటలోనే ఏడు పాటలకు బాణీలు కట్టి రికార్డింగ్ చేయించిన ఘనత చక్రవర్తిది. దాదాపు ఇరవై సంవత్సరాలు అవిశ్రాంతంగా సినిమాలకు సంగీతం సమకూర్చారు. ఏడాదికి 40కి పైగా చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన రోజులున్నాయి. నేడు చక్రవర్తి జయంతి. ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.