అందంలో మన్మథుడు, అభినయంలో మహారాజు, నిజాయితీలో ధర్మరాజు. కఠోరమైన క్రమ శిక్షణకు, ఖచ్చితమైన సమయపాలనకు కేరాఫ్ అడ్రస్ ఆయన. తెలుగు తెరకు గ్లామర్ ను, నటనలో గ్రామర్ ను నేర్పిన ఆ ఎవర్ గ్రీన్ సోగ్గాడు శోభన్ బాబు. ఇటు అమ్మాయిల కలల రాకుమారుడిగానూ, అటు ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడుగానూ నటించి మహిళా ప్రేక్షకుల నీరాజనాల్ని కొన్ని దశాబ్దాల కాలం పాటు అందుకున్న ఆయన అప్పట్లో ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ కు ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. ఎన్నో సాంఘిక, జానపద, చారిత్రక చిత్రాల్లో తనదైన బాణీని పలికించిన ఆయన .. కుటుంబ కథా చిత్రాలతో పాటు , యాక్షన్ చిత్రాల్లోనూ తనదైన శైలిలో నటించి, మెప్పించారు శోభన్ బాబు .
యన్టీఆర్ ‘దైవబలం’ చిత్రంతో నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు శోభన్ బాబు. ఆ తర్వాత వచ్చిన చిన్న చిన్న అవకాశాలను సైతం సద్వినియోగం చేసుకుంటూ తెలుగు టాప్ హీరోల్లో ఒకరిగా నిలిచారు. ‘నర్తనశాల, వీరాభిమన్యు, బంగారు పంజరం, మనుషులు మారాలి, దేవాలయం, సంపూర్ణ రామాయణం, బుద్ధిమంతుడు’ సినిమాలు శోభన్ బాబుకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ‘సోగ్గాడు, దేవత, పండంటి జీవితం, కార్తీక దీపం, ఇల్లాలు ప్రియురాలు, ఇల్లాలి కోరికలు, పున్నమి చంద్రుడు, ఉమ్మడి మొగుడు, కోరుకున్న మొగుడు’ లాంటి సినిమాలతో శోభన్ బాబు మహిళా ప్రేక్షకులకు ఆరాధ్య కథానాయకుడుగా మారిపోయారు. ఎప్పడూ ఎలాంటి కాంట్రవర్సీలకు పోకుండా…. అందరితోనూ కలిసిపోయే ఆయన సినిమాలకు దూరం అయిన తర్వాత మాత్రం ఎవరికీ కనిపించకుండా… కుటుంబానికే పరిమితమయ్యారు. హీరోగానే తన కెరీర్ ముగించారు. సహాయక పాత్రల జోలికి పోలేదు. సినీ జీవితానికి స్వస్తి చెప్పిన తర్వాత శోభన్ బాబు శేష జీవితాన్ని అందరికీ దూరంగా మద్రాసులో తన సొంత ఇంటిలోనే గడిపారు. శోభన్ బాబు మనిషిగా మరణించినా.. నటుడిగా.. ఉత్తమ వ్యక్తిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సోగ్గాడిగానే నిలిచి ఉన్నారు. నేడు ఆయన వర్ధంతి.. ఈ సందర్భంగా ఆ నట మహారాజు కు ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.