ఆకట్టుకొనే ముఖం.. ఆకర్షించే కళ్ళు.. కట్టిపడేసే చూపులు.. అందుకు తగ్గ ఒడ్డు, పొడుగు వెరసి సాయిధరమ్ తేజ. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా సినీ రంగప్రవేశం చేసినా తనకంటూ ఒక స్టైల్ ఏర్పరుచుకొని హీరో గా రాణిస్తున్నాడు. చిన్నప్పటి నుంచీ మేనమామను చూస్తూ పెరిగాడు. ఆయన నటనని, డ్యాన్సుల్ని పరిశీలిస్తూ ఎదిగాడు. అందుకే సాయిధరమ్ తేజ కూడా డ్యాన్సుల్లో అతడికంటూ… ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుంది.
సాయి ధరమ్ తేజ్ చిరంజీవి చెల్లలు విజయ దుర్గ కొడుకు. చిరంజీవితో పాటు నటులు పవన్ కళ్యాణ్, నాగబాబుకి మేనల్లుడు అవుతాడు. సినీ నటులు రామ్ చరణ్, వరుణ్ తేజ్ బావ వరస వాళ్ళు అవుతారు. సాయి ధరమ్ తేజ్ హైదరాబాద్ లో డిగ్రీ.. సెయింట్ మేరీ కాలేజీ లోనూ, ఎం.బి.ఏ ఐ.ఐ.పీఎం లోనూ చదివాడు. చదువైపోయిన తర్వాత నటలో శిక్షణను భిక్షూ దగ్గర తీసుకున్నాడు.
‘పిల్లా నువ్వులేని జీవితం’ మొదట విడుదలైనా.. నటుడిగా.. సాయిధరమ్ డెబ్యూ మూవీ మాత్రం ‘రేయ్’. వై.వి.యస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా ఏమంతగా మెప్పించలేకపోయింది. ‘పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్, చిత్రలహరి, ప్రతిరోజూ పండగే లాంటి సినిమాలతో తన ఇమేజ్ ను బాగానే పెంచుకున్నాడు. చిరంజీవి పోలికలున్నప్పటికీ ఆయన్ను ఇమిటేట్ చేసే ప్రయత్నం సాయి ఎప్పుడూ చేయకపోవడం విశేషం. అయితే అభిమానుల కోసం ఆయన సూపర్ హిట్ సాంగ్స్ ను మాత్రం రీమేక్ చేసి తన అభిమానం చాటుకున్నాడు. నేడు సాయిధరమ్ తేజ పుట్టినరోజు. ఈ సందర్బంగా అతడికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.