ప్రస్తుతం దగ్గుబాటి రానా.. తన తదుపరి చిత్రాల్ని వరుసగా పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. ప్రభుసాల్మన్ ‘హాథీమేరే సాథీ’, వేణు ఊడుగుల ‘విరాట పర్వం’ చిత్రాలు సెట్స్ మీదుండగానే.. మరిన్ని చిత్రాలను లైన్ పెట్టుకున్నాడు. తేజ దర్శకత్వంలో ‘రాక్షసరాజ్యంలో రావణాసురుడు’ (వర్కింగ్ టైటిల్ ) అనే వెరైటీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలాగే.. గుణ శేఖర్ పౌరాణిక చిత్రం ‘హిరణ్యకశ్యప’ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్ళే ప్రయత్నంలో ఉన్నాడు రానా. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో దాదాపు రూ. 100 నుంచి 125 కోట్ల బారీ బడ్జెట్ తో ‘హిరణ్య కశ్యప’ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా.. కొన్ని అనుకోని కారణాల వల్ల ఇప్పటివరకూ లేటవుతూ వచ్చింది. ఇప్పుడు దానికి సమయం ఆసన్నమైంది.
ఈ సమ్మర్ లో ‘హిరణ్యకశ్యప’ ను సెట్స్ మీదకు తీసుకెళ్ళనున్నారు. ఎక్కువ శాతం షూటింగ్ ను వైజాగ్ లోని రామానాయుడు స్టూడియో లో చేయనున్నారని తెలుస్తోంది. ఆరు నెలల పాటు కంటిన్యూస్ గా అక్కడే సినిమా చిత్రీకరణ జరగనుందని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. శ్రీ మహావిష్ణువు నే సర్వస్వంగా భావించిన ‘ప్రహ్లాదుడు’ రాక్షసుడైన తండ్రి హిరణ్యకశ్యపునికి శత్రువుగా మారతాడు. చివరికి శ్రీహరి నరసింహావతారమెత్తి హిరణ్య కశ్యపుణ్ణి సంహరించి .. ప్రహ్లాదుణ్ణి తనలో ఐక్యం చేసుకుంటాడు. ఇదే పౌరాణిక గాథ గతంలో ‘భక్త ప్రహ్లాద’గా వచ్చి.. ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించింది. ఇప్పుడు అదే కథను గుణశేఖర్ హిరణ్యకశ్యప కోణంలో చెప్పనుండడం విశేషం. మరి ఈ సినిమా రానాకు ఏ స్థాయిలో క్రేజ్ తెచ్చిపెడుతుందో చూడాలి.