భారతీయ తెరమీద ఇప్పటివరకూ ‘ఆది శంకరాచార్య, భగవద్గీత , ప్రియమానసం, ఇష్టి, సూర్యకాంత, అనురక్తి, పుణ్యకోటి’ లాంటి సంస్కృత చిత్రాలు విడుదలయ్యాయి. సంస్కృతం దైవ భాష కాబట్టి.. ఆ చిత్రాల కథాంశాలన్నీ ఆధ్యాత్మిక కోణంలో ఆవిష్కృతమయ్యాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో సినిమా కూడా చేరబోతోంది. సినిమా పేరు ‘నమో’. భక్త కుచేలుని కథను కొత్త కోణంలో ఆవిష్కరిస్తున్నాడు మలయాళ దర్శకుడు విజీష్ మణి . సినిమా మొత్తం సంస్కృత భాషలోనే తెరకెక్కుతోంది. విలక్షణ నటుడు ‘జయరామ్’ కుచేలుడి పాత్రలో భారతీయ ప్రేక్షకుల్ని భక్తిపారవశ్యంలో ముంచబోతున్నాడు. ‘భాగమతి’లోనూ, ఇటీవల ‘అల.. వైకుంఠపురములో’ లోనూ తన విలక్షణ నటనతో తెలుగు ప్రేక్షకుల్ని జయరామ్ అలరించిన సంగతి తెలిసిందే.
ఇక ‘నమో’ సినిమా కోసం జయరామ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఆ పాత్రను ఓన్ చేసుకొని మరీ మేకోవర్ అవుతున్నాడు. పూర్తి గా గుండుకొట్టించుకొని .. దాదాపు 20కేజీల వరకూ బరువు తగ్గి ‘నమో’ కోసం కష్టపడుతున్నాడు. ఇటీవల నమో సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. ఇక ఇందులో వివిధ భాషలకు చెందిన విశిష్ట నటీనటులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 101 నిమిషాల ప్రదర్శనా సమయం కలిగిన ఈ చిత్రం త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. మరి నమో సంస్కృత చిత్రం జయరామ్ కు ఏ స్థాయిలో పేరు తెచ్చిపెడుతుందో చూడాలి.