గొల్లపూడి మారుతీరావు ప్రధాన పాత్రలో నటించిన చక్కటి కుటుంబ కథా చిత్రం ‘సంసారం ఒక చదరంగం’. ఏవీయం ప్రొడక్షన్స్ బ్యానర్ పై యం.శరవణన్, యం.కుమరన్ నిర్మాతలుగా.. యస్.పీ.ముత్తురామన్ దర్వకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది. 1987లో విడుదలైన ఈ సినిమాలో శరత్ బాబు, సుహాసిని, రాజేంద్రప్రసాద్, ముచ్చెర్ల అరుణ, నూతన్ ప్రసాద్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. గణేష్ పాత్రలో మాటలు , వేటూరి పాటలు రాయగా.. చక్రవర్తి సంగీతం అందించారు. ఇందులో సంసారం ఒక చదరంగం అనే టైటిల్ సాంగ్ ఎంతగానో అలరిస్తుంది.

విశాఖపట్టణ స్టీల్ ప్లాంటులో పదవీ విరమణకు వయసు చేరువైన గుమస్తా అప్పల నరసయ్య (గొల్లపూడి మారుతీరావు), గోదావరి (అన్నపూర్ణ) దంపతులకు నలుగురు సంతానం. పెద్ద కొడుకు ప్రకాష్ (శరత్ బాబు) ఇండియన్ ఆయిల్ కంపెనీలో అకౌంటెంట్, అతని భార్య ఉమ (సుహాసిని), ఒక ఫ్యాక్టరీలో చిన్న ఉద్యోగం చేసుకుంటున్న రెండో కొడుకు రాఘవ (రాజేంద్ర ప్రసాద్), చదువు పూర్తిచేసి ఉద్యోగం చేస్తున్న కూతురు సరోజ (కల్పన), పదోతరగతి పరీక్షల్లో తరచు తప్పుతూండే చిన్న కొడుకు కాళిదాసు తల్లిదండ్రులతో ఒకే ఇంట్లో జీవిస్తూంటారు. వీరివి వేర్వేరు మనస్తత్వాలు, ఆశలు, ఆలోచనలు. ప్రకాష్ ఖర్చు దగ్గర ఖచ్చితంగా ఉండే మనిషి, భార్య ఉమ అందరితో కలుపుగోలుగా ఉంటూంటుంది, సరోజ కొద్దిపాలు అహంకారంతో వ్యవహరిస్తూ అప్పటికే పీటర్ అనే అబ్బాయిని ప్రేమించివుంటుంది, రాఘవ బాధ్యతలు తెలుసుకుని మసులుకుంటూండగా, కాళిదాసు బాధ్యతారాహిత్యంగా తిరుగుతూంటాడు. వీరందరి ఆశలు, ఆకాంక్షలు మధ్య సంసారాన్ని సాగిస్తూంటారు అప్పల నరసయ్య, గోదావరి. మధ్య నలభై ఏళ్ళ నుంచి ఆ ఇంటిలో పనిచేస్తూండే చిలకమ్మ (షావుకారు జానకి) ఇంటిలో మనిషిలాంటిదే. వీరి  కుటంబంలో చెలరేగిన కలతలు, సమస్యలు ఎలా పరిష్కరించుకున్నారన్నది చిత్ర కథాంశం. ప్రత్యేకించి సినిమాలోని పాత్రలు, సన్నివేశాలు, సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిలకమ్మ పాత్రలో కనబరిచిన నటనకు షావుకారు జానకి ఉత్తమ సహాయ నటిగా నంది పురస్కారం అందుకుంది. నిజానికి ఈ సినిమా ‘సంసారం అదు మిన్సారం’ అనే తమిళ సినిమాకి రీమేక్ వెర్షన్. ఇందులో విసు ప్రధాన పాత్ర పోషించగా.. ఈ సినిమా కూడా అక్కడ ఘన విజయం సాధించింది.

Leave a comment

error: Content is protected !!