చక్రాల్లాంటి కళ్ళు, చక్కటి చిరునవ్వు, నిండైన రూపం.. ఆమె ఆభరణాలు. సహజమైన నటన ఆమె చిరునామా. పేరు అంజలీదేవి. నాటి తరం ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పుడూ ఆమె సీతమ్మతల్లే. తన నటనా జీవితాన్ని రంగస్థలంతో ప్రారంభించింది అంజలీదేవి. తెలుగు తెరమీద ఎన్నో ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. సంగీత దర్శకుడు ఆది నారాయణరావు ను తన జీవిత భాగస్వామిగా చేసుకొని.. అంజలీ పిక్చర్స్ బ్యానర్ పై ఎన్నో విజయవంతమైన చిత్రాలూ నిర్మించింది.
తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో జన్మించిన అంజలీదేవి 1936 లో విడుదలైన ‘రాజా హరిశ్చంద్ర’ చిత్రంలో తొలిసారిగా తన అసలు పేరైన అంజనీ కుమారి గానే నటించింది. ప్రముఖ దర్శకుడు పి.పుల్లయ్య ఆమె పేరును అంజలీదేవిగా మార్చారు. ‘కీలు గుర్రం, శ్రీలక్ష్మమ్మ కథ, పల్లెటూరి పిల్ల, పక్కింటి అమ్మాయి, అనార్కలి, సువర్ణసుందరి, చెంచులక్ష్మి , భీష్మ’ లాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆ తర్వాత యన్టీఆర్ ‘లవకుశ’లో సీతమ్మ గా నటించి .. తెలుగు వారి ఆరాధ్య నాయిక అయిపోయింది. ఆ పాత్ర అప్పటి గ్రామీణ మహిళలను బాగా ప్రభావితం చేసింది. ఆమె కొన్ని గ్రామాలను సందర్శించడానికి వెళితే కొంతమంది ఆమెను నిజమైన సీతాదేవిగా భావించి మోకరిల్లిన సందర్భాలున్నాయి . ఇక ఆమె దాదాపు 500 తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించింది. ‘బృందావనం , అన్న వదిన , పోలీస్ అల్లుడు’ ఆమె నటజీవితంలో చివరి చిత్రాలు. నేడు అంజలీదేవి జయంతి. ఈ సందర్భంగా ఆమెకు ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్. .