నేచురల్ స్టార్ నానీ 25వ సినిమాగా.. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘వి’. నిజానికి ఈ ఏడాది ఉగాది కానుకగా మార్చ్ 25నే విడుదల కావాల్సిన ఈ సినిమా .. లాక్ డౌన్ కారణంగా 6 నెలల తర్వాత ఇప్పుడు ఈ రోజు విడుదలయింది. కాకపోతే ఓటీటీలో విడుదలవడం.. అందులోనూ నానీ లాంటి స్టార్ హీరో సినిమా అవడం.. సినిమా మీద అంచనాల్ని అమాంతం పెంచేసింది. ఇంతకీ ప్రేక్షకులు అంచనాల్ని ఈ సినిమా ఏ మేరకు అందుకుందో ? ఈ సినిమా ప్రత్యేకతలేంటో రివ్యూలో చూద్దాం..
నానీ లాంటి మిడిల్ రేంజ్ హీరో .. యాక్షన్ హీరో అవతారం ఎత్తడం ‘వి’ విషయంలో కొత్త అంశమే అవ్వొచ్చుకానీ.. ఎంపిక చేసుకున్న కథ కొత్తది అయితే కాదు. ఎప్పుడో ఎనభైల్లో మన తెలుగు హీరోలందరూ చేసి పడేసిన ఒక మూస మాస్ రివెంజ్ స్టోరీ. అదే కథను నానీ, సుధీర్ బాబు లాంటి హీరోల మీద ప్రయోగించాలని చూశాడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ. ప్రయత్నం మంచిదే కానీ.. అంతగా వర్కవుట్ కాలేదు.
కథ : హైదరాబాద్ పాతబస్తీలో మత కల్లోలాలు జరుగుతుంటే అక్కడికెళ్లి 30 మందిని ప్రాణాలతో బయట పడేసినందుకు డీసీపీ ఆదిత్య (సుధీర్ బాబు) ను ప్రభుత్వం ‘శౌర్య’ పతకంతో సత్కరిస్తుంది. ఈ ఆనందంలో అందరికీ పార్టీ ఇచ్చిన రాత్రి ఒక పోలీసాఫీసర్ హత్యకు గురవుతాడు. ఆ హత్య చేసిన వ్యక్తి.. తాను ఇంకో నలుగురిని చంపబోతున్నట్లు సంకేతాలివ్వడం ద్వారా ఆదిత్యను సవాలు చేస్తాడు. ఈ కేసును ఛేదించేందుకు ఆదిత్య తన ప్రయత్నాలు చేస్తుండగానే.. హంతకుడు చెప్పినట్లే ఒకరి తర్వాత ఒకరిని చంపుతూ వెళ్తాడు. మూడో హత్య తర్వాత ఈ దారుణాలు చేస్తోంది విష్ణు (నాని) అనే మాజీ సైనిక అధికారి అని ఆదిత్యకు అర్థమవుతుంది. అతడి గురించి వివరాలన్నీ సేకరిస్తాడు. మరి నిజంగానే విష్ణునేనా ఆ హంతకుడు.. అదే నిజమైతే అతనెందుకలా చేస్తున్నాడు.. మిగతా రెండు హత్యలు చేయకుండా విష్ణును ఆదిత్య ఆపగలిగాడా అన్నది మిగతా కథ.
కథనం, విశ్లేషణ :
ఒక దశ దాటాక ‘వి’ సినిమా చూస్తున్నపుడు ప్రేక్షకులకు ఈ సినిమాలోని సీన్స్ వేరే ఏదో సినిమాలోని సీన్స్ ను పోలి ఉన్నాయని అనిపించకమానదు. ఒక సీరియల్ కిల్లర్.. వరుసబెట్టి హత్యలు చేస్తుంటాడు. అన్నింట్లోనూ ఒక ప్యాటెర్న్ పాటిస్తుంటాడు. క్లూస్ వదులుతుంటాడు. ఒక ఇంటలిజెంట్ ఆఫీసర్ కేసును ఛేదించే బాధ్యత తీసుకుంటాడు. ఇద్దరి మధ్య క్యాట్ అండ్ మౌన్ గేమ్.. ఆపై కిల్లర్ మోటివ్ ఏంటని తెలుస్తుంది. అతడికో ఫ్లాష్ బ్యాక్. అందులో అతడికి అన్యాయం చేసిన వాళ్లపై అతను ప్రతీకారం తీర్చుకుంటూ ఉంటాడు. ఈ తరహా కథలతో బోలెడన్ని సినిమాలు చూశాం ఇప్పటికే. ఐతే వాటి నుంచి ‘వి’ని భిన్నంగా నిలబెట్టే అంశాలేవే లేకపోవడం పెద్ద మైనస్. పేరుకు థ్రిల్లర్ సినిమానే కానీ.. ఇందులో ఉత్కంఠ అన్న మాటే లేదు. చివరి వరకు ‘విషయం’ దాచి పెట్టారు కాబట్టి సినిమాలో ‘సస్పెన్స్’ ఫ్యాక్టర్ ఉంది అనుకోవాలి తప్పితే.. అసలేం జరిగి ఉండొచ్చు అనే ఆసక్తి రేకెత్తించడంలో ‘వి’ విఫలమైంది.
నటీనటులపెర్ఫార్మెన్స్ : ముందు నుంచీ ఇందులో నానీ విలన్ అని ఊదరగొట్టేశారు. అయితే సినిమా చూసినప్పుడు నానీ విలన్ కాదు, హీరో నే అనుకోవడం ప్రేక్షకులకు ఒక విధంగా సర్ ప్రైజ్ ఇచ్చినట్టే అని దర్శకుడు భావించాడో ఏమో కానీ.. ఇంద్రగంటి కూడా ఇంర్వ్యూస్ లో నానీ విలన్ కాదు హీరోనే అని వివరణ ఇచ్చే ప్రయత్నం ఏమీ చేయలేదు. సుధీర్ బాబు ను యాక్షన్ హీరోగా ప్రజెంట్ చేయాలన్న ఇంద్రగంటి ప్రయత్నం బిగినింగ్ లో వచ్చే ఫైట్ సీక్వెన్స్ దగ్గర బాగానే సక్సెస్ అయింది. హీరోయిన్ గా నివేదా థామస్ ఓవర్ యాక్టివ్ గా పెర్ఫార్మ్ చేస్తే.. అదితీరావు హైదరీని మరీ లోప్రొఫైల్ లో ప్రజెంట్ చేశాడు దర్శకుడు. ఇందులో ప్రత్యేకించి విలన్స్ గా ఎవరినీ చూపలేదు. అందరినీ గంపగుత్తుగా ముందే చంపేయడం వల్ల .. చివరికి వచ్చేసరికి ఎక్సయిటింగ్ శాతం తగ్గిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. అందుకే క్లైమాక్స్ తేలిపోయింది.
సాంకేతిక నిపుణులు : సాంకేతికంగా ‘వి’ ఉన్నతంగానే కనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమాకు ప్లస్ పాయింట్. దిల్ రాజు బేనర్ స్థాయికి తగ్గట్లే రిచ్ గా సినిమాను తెరకెక్కించారు. పి.జి.విందా కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. అమిత్ త్రివేది పాటల్లో నేనేనా వచ్చేస్తున్నా ప్రత్యేకంగా అనిపిస్తుంది. మిగతా పాటలు ఓకే. అయితే పాటలు ఆగి ఆస్వాదనిపించే స్థాయిలో లేవు. ఒక థ్రిల్లర్ సినిమాకు అవసరమైన ఎక్కువ పాటలుండి.. నిడివి పెరగడానికి కారణమయ్యాయి. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ మరీ గొప్పగా లేదు.
ఫైనల్ గా : ఇంద్రగంటి లాంటి మేథావి నుంచి గొప్పగా ఏదో ఆశించిన ప్రేక్షకుల్ని ఎంతో కొంత ఈ సినిమా నిరాశపరిచిందని చెప్పుకుని తీరాలి. కేరక్టర్స్ లో ఇంటెలిజెన్సీని దిట్టంగా కూరిన దర్శకుడు.. కథాకథనాల్లో మాత్రం దాన్ని మిస్ అయ్యాడు. లేకుంటే.. ‘వి’ సినిమా నానీకి ల్యాండ్ మార్క్ సినిమా అయి ఉండేది.
బోటమ్ లైన్ : ‘వి’క్టరీ కాదు
రేటింగ్ : 2.5 /5