అకిరా కురసోవా. ఈ పేరు వింటే ప్రపంచ సినిమాకి ఛాతి గర్వంగా ఉప్పొంగుతుంది. సినిమా అనే పదం పులకించిపోతూ.. ఆయన ప్రతిభకు సాష్టాంగ ప్రణామం చేస్తుంది. ఆయన సినిమాలు ప్రపంచ తెరకే  పాఠ్యాంశాలు. ఆయన మేథస్సు అపూర్వం అద్వితీయం. సినిమా పట్ల ఆయనకున్న అవగాహన.. సునిశిత దృష్టి ఆసియాలోనే వేరెవరికీ లేదంటే అందులో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. సాటిలేని ఆ మేటి దర్శకుడు  తీసే ప్రతి చిత్రంలో మానవీయ విలువలు, ఎప్పుడూ తప్పకూడని నీతి, మనిషి జీవన పోరాటం, మనిషిగా నిలబడటం కోసం పడే ఆరాటం దర్శనమిస్తాయి.

1948లో మొదలై ఐదు దశాబ్దాల పాటు సాగిన ఆయన సినీ ప్రయాణంలో రషోమన్‌, ఇకిరి, సెవెన్‌ సమురాయ్‌,యొజింబో’, థ్రోన్‌ ఆఫ్‌ బ్లడ్‌, దెర్సు ఉజాలా, డ్రీమ్‌, రప్పోడీ ఇన్‌ ఆగస్ట్‌ ఇలా  ఒక్కో సినిమా ఒక్కో అద్భుతంగా సినీ చరిత్రలో కనబడుతుంది. ఇంతటి ప్రతిష్ఠాత్మక చిత్రాలెన్నింటినో తెరకెక్కించిన దర్శకుడు అకీరా కురొసోవా గురించి ఎంత తెలుసుకున్నా తనివితీరదు.  ఆయన జీవిత చరిత్రే ఒక గ్రంథం. తన 57 సంవత్సరాల సినిమా కెరీర్‌లో దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్‌ప్లే రచయితగా, ఎడిటర్‌గా ఇలా అన్ని రంగాల్లోనూ ఎంతో కీర్తి గడించాడు కురసోవా. ప్రపంచ సినిమా చరిత్రలో అత్యంత ప్రభావశీలమైన వ్యక్తిగా చెరగని ముద్ర వేశాడు.  నేడు ఆయన జయంతి. ఈ సందర్భంగా ఆ మహాదర్శకుడికి ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.

Leave a comment

error: Content is protected !!