కళ్ళల్లో క్రౌర్యం.. చూపుల్లో తీవ్రత.. గంభీరమైన వాచకం.. అద్భుతమైన అభినయం.. అందుకు తగ్గ ఆంగికం.. ఆయన ఆభరణాలు. అందుకే విలన్ పాత్రల్లో ఆయన అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఆయనపేరు అమ్రిష్ పురి. పూర్తి పేరు అమ్రిష్‌లాల్ పురి. హిందీ, తెలుగు, కన్నడ, మరాఠీ, పంజాబీ, మలయాళం, తమిళ్, ఆంగ్లం వంటి భాషల్లో దాదాపు 400పైగా చిత్రాల్లో నటించారు. ఫిలింఫేర్‌తో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకొన్నాడు. మొదటి ప్రయత్నంలోనే కెమెరా ముందు పరీక్షలో విఫలం అయ్యారు. దాంతో ముంబైలోనే ఉద్యోగం వెతుక్కోవలసి వచ్చింది. ఉద్యోగం చేస్తూనే నాటక ప్రదర్శనలిస్తూ నటనలో శిక్షణ పొందారు.
‘ప్రేమ్ పూజారి’ చిత్రంతో బాలీవుడ్‌లో రంగప్రవేశం చేశారు అమ్రిష్ పురి . ‘మేరీ జంగ్’తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ప్రతినాయకుడిగా నటించిన ‘సూరజ్ కా సత్వాన్ ఘోదా’, ‘ఘటక్’, ‘విరాసాట్’ వంటి చిత్రాలు బాలీవుడ్‌లో తనను తిరుగులేని స్థానంలో నిలబెట్టాయి. ‘సౌధాగర్’, ‘తెహల్కా’, ‘ముస్కురాత్’, ‘దామిని’, ‘గార్డిష్’, ‘కరణ్ అర్జున్’, ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’, ‘కోయ్లా’, ‘బాద్‌షా’ వంటి సినిమాలతో భారీ విజయాలందుకున్నారు. ‘మిస్టర్ ఇండియా’లో అద్భుత నటన కనబరిచారు. తెలుగులో అనుగ్రహం, నాగార్జున ఆఖరిపోరాటం, చిరంజీవి ‘జగదేకవీరుడు..అతిలోకసుందరి, కొండవీటి దొంగ చిత్రాల్లో ఆయన నటన మరపురానిది. 1984లో స్టీఫెన్‌స్పీల్ బర్గ్ చిత్రం ‘ఇండియానా జోన్స్’ చిత్రంలో పాత్ర కోసం ఆయన గెడ్డం, గుండు చేయించుకున్నారు. రిచర్డ్ అటెన్ బరో తీసిన ‘గాంధీ’ చిత్రంలో పాత్ర ద్వారా అంతర్జాతీయ ప్రేక్షకకులకు పరిచయం అయ్యారు. నేడు అమ్రిష్ పురి వర్ధంతి. ఈ సందర్భంగా ఆ విలక్షణ నటుడికి ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.