అర్జున్ రెడ్డి’ నుంచి ‘టాక్సీ వాలా’ వరకూ విజయ్ దేవరకొండ లెవెలే వేరు. అప్పట్లో టాలీవుడ్ లో ఎంత పెద్ద దర్శకుడికయినా.. అతగాడి కాల్షీట్స్ దొరకడమే గగనం అయిపోయేది. ఇక చిన్న దర్శకుల అవస్థ చెప్పనే అక్కర్లేదు. అలాంటి వారిలో మారుతి కూడా ఒకడు. ఒకదశలో కథ చెప్పడానికి వెళ్ళిన మారుతిని విజయ్ దేవరకొండ లైట్ తీసుకొని కథ వినడానికి ఆసక్తి చూపించలేదట. కానీ ఇప్పుడు విజయ్ రేంజ్ నేల మీదకు వచ్చేసింది. వరుసగా ‘డియర్ కామ్రేడ్ , వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీస్ డిజాస్టర్స్ అవడంతో విజయ్.. తనకి ఇప్పటికిప్పుడు హిట్టిచ్చే దర్శకుడు ఎవరా అని ఆలోచించే పరిస్థితిలో ఉన్నాడు.
ఈ నేపథ్యంలో మరోసారి మారుతి.. విజయ్ తో సినిమాకి ఒప్పించే వ్యూహాన్ని అమలు చేస్తున్నాడని టాక్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మారుతి.. విజయ్ తో సినిమా చేయడం పెద్ద సమస్యకాదు. పైగా ‘ప్రతిరోజూ పండగే’ హిట్టు తో విజయ్ కన్నా మారుతినే ఒక మెట్టు పైనున్నాడు. అందుకే విజయ మారుతి దర్శకత్వంలో నటించడానికి ఇప్పుడు ఆసక్తి చూపిస్తున్నాడని సమాచారం. మారుతి ప్రస్తుతం విజయ్ కోసం ఒక అదిరిపోయే స్ర్కిప్ట్ రాస్తున్నాడట. బహుశా మారుతి తదుపరి చిత్రం ఇదే కావచ్చంటున్నారు. నిజానికి మారుతి ఇప్పుడు డివివి దానయ్య వారసుడ్ని స్ర్కీన్ కు పరిచయం చేసే పనిలోబిజీగా ఉండాలి. ఆ ప్రాజెక్ట్ అటకెక్కడంతో.. మారుతి దృష్టంతా ఇప్పుడు విజయ్ సినిమా మీదే ఉందని వినికిడి. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ మూవీతో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా పూర్తయ్యే టైమ్ కు మారుతి సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుందని టాక్. మరి మారుతి విజయ్ కు ఏ రేంజ్ సినిమా ఇస్తాడో చూడాలి.