సినీ పరిశ్రమలోని వారికి క్రమశిక్షణ , సమయపాలన ఖచ్చితంగా ఉండితీరాలి. ఈ రెండూ లేకనే చాలా మంది మంచి టాలెంట్ ఉండి కూడా.. సినీరంగంలో రాణించలేకపోయారు. అయితే ఈ రెండు విషయాల్లోనూ అన్నగారు యన్టీఆర్ అందరికీ ఓ రోల్ మోడల్ లాంటి వారు. దీనికి సరిగ్గా సరిపోయే ఒక సంఘటన 1972 లో జరిగింది. ఆ ఏడాది యన్టీఆర్ తన ఇమేజ్ కు భిన్నంగా బడిపంతులు సినిమాలో నటించారు. అందులో వృద్ధుడైన ఒక రిటైర్డ్ స్కూల్ మాస్టర్ గా నటించారు యన్టీఆర్. దీనికి పీ.సీ.రెడ్డి దర్శకులు. ఒకరోజు.. పొద్దున్నే షూటింగ్ కు వెళ్తూ యన్టీఆర్ డైరెక్టర్ తో.. రెడ్డిగారూ.. ఈ రోజు నేను కాస్తంత తొందరగా భోజనానికి వెళ్తాను. మా అమ్మాయికి డైమండ్ రింగ్ కొనాలి. ఆమె జాతకరీత్యా మధ్యాహ్నం 12: 30కి కొనాలి. మీరు అనుమతిస్తే నేను 12గంటలకి వెళ్ళి మళ్ళీ 3గంటలకు తిరిగి వస్తాను అని చెప్పారట. అసలు యన్టీఆర్ తలుచుకుంటే.. ఎవరినీ అనుమతి అడగనక్కర్లేదు. కానీ ఒక దర్శకుడికి గౌరవం ఇచ్చి.. ఆయన అనుమతి తీసుకోవడంలోనే ఆయన క్రమశిక్షణ ఏ పాటిదో అర్ధమవుతుంది. అలా అడిగినందుకు దర్శకుడు పి.సి.రెడ్డి చాలా ఆశ్చర్యపోయారట. ఎందుకంటే… అప్పుడే ఆయన దర్శకుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టారు. ఆయనకన్నా వయసులో పిీసీ రెడ్డి చాలా చిన్నవాడు. ఇప్పటికీ ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ ఉంటారు చంద్రశేఖరరెడ్డి .