‘
‘సైరా నరసింహారెడ్డి’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ‘సైరా’ రిలీజ్ అయిన కొద్ది రోజులకే లాంఛ్ అయిన మెగా కొరటాల మూవీ ప్రస్తుతం సెట్స్ మీదుంది. ఈ సినిమా దేవాదాయ శాఖలోని అక్రమాల పై కొరటాల సంధిస్తోన్న పాశుపతాస్త్రమని తెలుస్తోంది. ఇందులో చిరు రెండు వైవిధ్యమైన పాత్రల్ని పోషిస్తున్నాడని .. ఈ సినిమాకి ‘గోవింద ఆచార్య, ఆచార్య’ అనే రెండు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయని మొన్నటివరకూ వార్తలొచ్చాయి. ఫైనల్ గా దీనికి ‘ఆచార్య’ అనే టైటిల్ ఖాయం చేశారని టాక్.
నిజానికి ఇలాంటి కథతో గతంలో రాజశేఖర్ హీరోగా కోడిరామకృష్ణ దర్శకత్వంలో ‘రథయాత్ర’ అనే సినిమా తెరకెక్కింది. ( ఈ సినిమా మోహన్ లాల్ నటించిన ‘అద్వైతం’ మలయాళ మూవీకి రీమేక్.) అందులో రాజశేఖర్ హోమ్ మినిస్టర్ గా నటించాడు. ఆయన పాత్ర హోం మినిస్టర్ గా మారే క్రమంలో దేవాదాయ శాఖలోని అవినీతి, అక్రమాల్ని, అకృత్యాల్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. అప్పట్లో ఆ సినిమా డిజాస్టర్ అయింది. మళ్లీ ఇన్నాళ్ళకు దేవాదాయ శాఖ వ్యవస్థలోని లోపాల్ని ఎత్తి చూపించే కథాంశంతో కొరటాల శివ .. చిరంజీవితో మరో ప్రయత్నం చేయనుండడం విశేషంగా మారింది. మరి మెగాస్టార్ కు ఆ కథ ఎలాంటి సక్సెస్ నిస్తుందో చూడాలి.