చూడచక్కని అందంతో, అందమైన అభినయంతో ఒకప్పుడు దక్షిణాది ప్రేక్షకుల్ని మెప్పించిన నటీమణి ఆమె. చిన్నతనం నుంచే వెండితెరమీద మెరిసిన నట విదుషీమణి ఆమె. పేరు రోజారమణి. 1970, 1980 వ దశకాల్లో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ సినిమాలలో కథానాయికగా నటించింది. సుమారు 400 సినిమాలకు డబ్బింగ్ కళాకారిణిగా మెప్పించింది. మాస్టర్ తరుణ్ అనే పేరుతో బాలనటుడిగా చక్కగా నటించి తరువాత కథానాయకుడు అయిన తరుణ్ రోజారమణి తనయుడు.
రోజారమణి మద్రాసులో జన్మించింది. ఆమె తండ్రి ఒక విలేఖరి. ఆమె 5 సంవత్సరాల వయసులో భక్త ప్రహ్లాద సినిమాలో ప్రహ్లాదుడిగా నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. బాలనటిగా సుమారు 70 సినిమాల్లో నటించిన తర్వాత 13 ఏళ్ళ వయసులోనే చంబరతి అనే మలయాళ సినిమాలో కథానాయికగా నటించింది. ఆ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇదే సినిమా తెలుగులో కూడా రోజా రమణి కథానాయికగా ‘కన్నె వయసు’ అనే సినిమా గా, తమిళంలో ‘పరువకాలం’ గా పునర్నిర్మించారు.
ఆ తరువాత అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీ, ఒడియా భాషల్లో దాదాపు 300 సినిమాల్లో నటించింది. తెలుగు, తమిళ భాషల్లో సుమారు 400 సినిమాల్లో సుహాసిని, మీనా, రాధిక, రమ్యకృష్ణ, రోజా, విజయశాంతి, శిల్పాశెట్టి, దివ్యభారతి, నగ్మా, కుష్బూ లాంటి నటీమణులకు గాత్రదానం చేసింది. ప్రస్తుతం ఆమె బ్లూ క్రాస్ లో సభ్యురాలిగా చేరి సమాజ సేవ చేస్తోంది. నేడు రోజారమణి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.