ఇప్పుటి సీనియర్ హీరోలకు .. ఒకప్పుడు వారితోనే కథానాయికలుగా నటించిన వారు తల్లిగా నటిస్తే .. అంతగా ఆశ్చర్యపోనక్కర్లేదు కానీ.. ఇంచుమించు ఒకే సారి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఇద్దరు యువ నటీనటులు తల్లి కొడుకులుగా తెరమీద కనిపిస్తే ఎలా ఉంటుంది? అసలు దాన్ని ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా? కానీ చేశారు. ఆ హీరో రజనీకాంత్, ఆ హీరోయిన్ శ్రీదేవి. అయితే ఇందులో చిన్న తేడా.. శ్రీదేవి రజనీకాంత్ కు అసలు తల్లి కాదు.. సవతి తల్లి. సినిమా పేరు ‘మూండ్రు ముడిచ్చు’. తన ప్రియుడ్ని చంపించి అతడి నుంచి తనను వేరు చేసిన రజనీకాంత్ మీద పగతో.. అతడి తండ్రినే పెళ్ళిచేసుకొని.. అతడికి తల్లిగా ఆ ఇంటికే వెళుతుంది. ఇందులో శ్రీదేవి ప్రియుడిగా కమల్ హాసన్ నటించడం విశేషం. కె.బాలచందర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పటి ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించింది. నిజానికి ఈ సినిమా ఓ సీత కథ’ తెలుగు సినిమాకి రీమేక్ వెర్షన్. కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది.