విలక్షణమైన ఆయన పాటకు పులకించని రాగమే లేదు. ఆయన ఆలపించే అద్భుతమైన రాగాలకు స్పందించని హృదయమే లేదు. ఆయన పేరు కట్టశ్శేరి జోసఫ్ ఏసుదాసు. మనమంతా వినయంగా, గౌరవంగా ఆయన్ను కె.జే.యేసుదాసు అని పిలుచుకుంటాము. కేరళీయులు ఆయన్ను మరింత భక్తి పూర్వకంగా గాన గంధర్వన్ అంటారు. ఆయన తన ఐదు దశాబ్దాల కళా జీవితంలో వివిధ భారతీయ భాషలైన మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, బెంగాలీ, ఒరియా భాషలతో పాటు అరబిక్, ఆంగ్లం, లాటిన్, రష్యన్ భాషలలో సుమారు 80వేల పాటలను పాడి తన గాత్రం గొప్పతనమేంటో చాటిచెప్పారు. ఒక్క పంజాబీ, అస్సామీ, కొంకణి, కాశ్మీరీ భాషలు తప్ప దాదాపు అన్ని భారతీయ భాషలలో కూడా పాటలు పాడిన ఆయన 70 , 80 ల్లో అనేక మలయాళ చలనచిత్ర పాటలను కూడా కూర్చారు. అంతేకాదు ఆయన బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ గా జాతీయ పురస్కారాలను ఎనిమిది సార్లు, దక్షిణాది పిలిం ఫేర్ పురస్కారాలను ఐదు సార్లు, ఉత్తమ నేపధ్య గాయకునిగా రాష్ట్ర పురస్కారాన్ని నలభై మూడు సార్లు అందుకుని రికార్డు సృష్టించారు. ఇక ఆయన 1975లో పద్మశ్రీ పురస్కారాన్ని, 2002లో పద్మ భూషణ్ పురస్కారాన్ని, 2017లో భారత రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ ను కూడా అందుకున్నారు. మొత్తంగా ఆయన ఐదు దశాబ్దాలలో 80,000 పాటలు పాడినందుకు గాను 2011లో సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ అత్యుత్తమ సాధనా పురస్కారాన్ని అందుకున్నారు. 2006లో చెన్నైలోని ఎ.వి.ఎం స్టుడియోలో ఒకే రోజు నాలుగు భారతీయ భాషలలో 16 సినిమా పాటలను పాడి తన స్థాయేంటో చాటిచెప్పిన సింగింగ్ లెజెండ్ ఆయన. నేడు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆ గాన గంధర్వుడికి విషెస్ తెలుపుతోంది మూవీ వాల్యూమ్.