విశ్వవిఖ్యాత నటసార్వభౌమ డా. యన్టీఆర్ కి 1965 చాలా విజయవంతమైన సంవత్సరం. ఆ ఏడాది ఆయన సినిమాలు 12 విడుదల కాగా.. అందులో ఎనిమిది సినిమాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి. వాటిలో ఏడవ సినిమా ‘సి.ఐ.డి’. ప్రతిష్థాత్మక సంస్థ విజయా వారి నిర్మాణ సారధ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి దర్శకుడు తాపీ చాణక్య. 1965, సెప్టెంబర్ 23న విడుదలైన ఈ సినిమా నేటితో సరిగ్గా 55 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. జమున కథానాయికగా నటించగా..గుమ్మడి వెంకటేశ్వరరావు, మిక్కిలినేని, పండరీబాయ్, రాజనాల, రమణారెడ్డి, హేమలత తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. తొలి జేమ్స్ బాండ్ చిత్రం డాక్టర్ నో ప్రేరణతో తెరకెక్కించిన ఈ సినిమాకి చక్కటి వినోదాన్ని కూడా జోడించారు దర్శక,నిర్మాతలు.
రవి(యన్టీఆర్) కి బొంబాయిలో సి.ఐ.డి. ఇన్స్‌పెక్టర్ ఉద్యోగం వస్తుంది. చలపతి (గుమ్మడి) ముఠా బొంబాయిలో ఒక బ్యాంకును దోచుకొని ఆ డబ్బుతో మద్రాస్ చేరుకుంటుంది. ఆ దొంగల ముఠాను పట్టుకొనే బాధ్యతను ప్రభుత్వం సి.ఐ.డి. రవికి అప్పగిస్తుంది. రవి మద్రాసులో అడుగుపెట్టి తల్లితో వుంటూ నేరపరిశోధనలో నిమగ్నమవుతాడు. రామదాసు వద్ద పెరుగుతున్న వసంత (జమున )తో రవికి పరిచయం పెరిగి, ఆమె రవిని ప్రేమిస్తుంది. ఉద్యోగ బాధ్యతను దైవంగా నమ్మి, పనికే అంకితమైన రవి వసంత ప్రేమను పెద్దగా పట్టించుకోడు. అలాగని ఆమె అంటే ప్రేమ లేకపోలేదు. విధి నిర్వహణలో రవికి ఒక ఇన్ఫార్మర్ వ్యాఘ్రేశ్వర భాగవతార్ (రమణారెడ్డి) మారుపేరుతో సహకరిస్తూ ఉంటాడు. బాబాపై అనుమానంతో రవి అతడు నడిపే వడ్డీ వ్యాపార స్థలానికి వెళతాడు. బాబా వడ్డీ వ్యాపార ముసుగులో లోపల దోపిడీ ముఠాను పోషిస్తూ దొంగవ్యాపారం చేస్తూవుంటాడు. అది తెలిసి బాబా రవిని హతమార్చడానికి ఉద్ధండాన్ని నియోగిస్తాడు. రవి తాకట్టు కోసం వచ్చిన వ్యక్తిలా నటిస్తూ తన వద్ద ఉన్న గడియారపు గొలుసును చూపి అప్పు అడుగుతాడు. అది చూసి బాబా (చలపతి) రవి తన కొడుకేనని గుర్తిస్తాడు. అదే సమయంలో ఉద్ధండం విసిరిన కత్తి బాబాకు తగులుతుంది. రవి బాబాను తన తల్లి పనిచేసే ఆసుపత్రిలో చేర్చుతాడు. అలా పార్వతి, బాబా అనబడే చలపతి ఒకరినొకరు గుర్తుపట్టి రవి వారి బిడ్డ అనే రహస్యాన్ని గుప్తంగా ఉంచుతారు. చలపతి ధోరణి మారి దోపిడీ పనులకు స్వస్తి చెప్పాలని నిర్ణయించుకోవడంతో, అనుమానం వచ్చిన ఉద్ధండం (రాజనాల) రవి మీద లంచం కేసుపెట్టి అతడిని సస్పెండ్ చేయిస్తాడు. రవి యుక్తి పన్ని దొంగల ముఠాను పోలీసులకు పట్టించడంతో కథ సుఖాంతం అవుతుంది. పింగళి రచన చేయగా.. ఘంటసాల మాస్టారు సంగీతం అందించారు. ఇందులోని పాటలన్నీ ఎంతగానో అలరిస్తాయి.