మహానటుడు యన్టీఆర్ నటించిన కుటుంబ కథాచిత్రాల్లో ‘విశాల హృదయాలు’ చాలా ప్రత్యేకమైన సినిమా. 1965 లో విడుదలైన ఈ సినిమా 55 ఏళ్ళు పూర్తి చేసుకుంది. గోకుల్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై దోనేపూడి కృష్ణమూర్తి నిర్మాణంలో, బి.యస్.నారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది. సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది. కృష్ణ కుమారి కథానాయికగా నటించగా.. ఇంకా చిత్తూరు నాగయ్య, రేలంగి, గుమ్మడి , నాగభూషణం, చలం, చదలవాడ, గిరిజ, హేమలత, చంద్రకళ, రాధాకుమారి తదితరలు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.
విశ్వనాథానికి (గుమ్మడి) భార్య చనిపోతే.. అతడి బావమరిది భద్రయ్య దగ్గరుండి రెండో పెళ్లి జరిపిస్తాడు. అయితే వారికి ఓ కొడుకు ఉన్న సంగతి దాచిపెట్టి పెళ్లి చేస్తాడు. అతడి కొడుకు శంకరం (యన్టీఆర్ ) తాత సంరక్షణలో పెరుగుతాడు. పట్టాభి అనే అతడి స్నేహితుడి (నాగభూషణం )ఇంట్లో ఉంచి చదివిస్తుంటాడు. పట్టాభి కూతురు పార్వతి, శంకరం ప్రేమలో పడతారు. పెద్ధల్ని ఎదిరించి పెళ్లి చేసుకుంటారు. వారికి ఒక బిడ్డ పుడతాడు. అయితే పట్టాభి చిన్నకూతురు ఇందిర పెళ్ళికి వచ్చిన శంకరం, పెద్ద కూతురు పార్వతిలను అవమాన పరుస్తాడు పట్టాభి. దాంతో ఆ కుటుంబాల మధ్య కలహాలు ప్రారంభమవుతాయి. చివరికి అన్ని సమసిపోయి.. అందరూ ఒకటవడమే మిగతా కథ. టీవీరాజు సంగీత సారధ్యంలోని పాటలన్నీ అప్పటి ప్రేక్షకుల్న ఎంతగానో అలరించాయి.