విలక్షణ నటుడు మోహన్ బాబు కెరీర్ లో వైవిధ్య కథా చిత్రం ‘ యం.ధర్మరాజు యం.ఏ’. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో 1994లో విడుదలైన ఈ సినిమా అద్భుత విజయం సొంతం చేసుకుంది. రంభ, సురభి, సుజాత, కైకాల సత్యనారాయణ, మోహన్ రాజ్, మల్లికార్జునరావు, యం.యస్ .నారాయణ తదితరులు నటించిన ఈ సినిమాలో మోహన్ బాబు తండ్రి , కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. అంతేకాదు మోహన్ బాబు తన కెరీర్ లోనే హీరోగానూ, విలన్ గానూ నటించిన మొట్టమొదటి డ్యూయల్ రోల్ చిత్రంగా చరిత్రకెక్కింది. ఆవారా లా తిరిగే ధర్మరాజు అనే ఒక సాధారణ వ్యక్తి తనకున్న కుయుక్తులతోనూ, మోసపూరితమైన వ్యక్తిత్వంతోనూ అతి తక్కువకాలంలోనే ఒక రాజకీయ శక్తిగా ఎదుగుతాడు. అంతేకాదు .. ఆ క్రమంలో తన కన్నకొడుకే పోలీస్ గా ఎదిగి.. తనకు శత్రువుగా మారతాడు. చివరికి ధర్మరాజు అధర్మం గెలుస్తుందా? కన్నకొడుకు ధర్మం గెలుస్తుందా అనేదే మిగతా కథ. మోహన్ బాబు టైటిల్ రోల్ ను అత్యద్భుతంగా పోషించి మెప్పించిన ఈ సినిమా నిజానికి తమిళంలో సత్యరాజ్ హీరోగా వచ్చిన ‘అమైదిప్పడై’ చిత్రానికి రీమేక్. ఈ సినిమా అప్పట్లో తమిళనాట రికార్డు కలెక్షన్స్ రాబట్టింది. నాగరాజ చోళన్ గా సత్యరాజ్ అనితర సాధ్యమైన నటన తమిళ తంబీల్నిబాగా మెప్పించింది. మణివణ్ణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఆ తర్వాత తమిళంలో సీక్వెల్ కూడా తెరకెక్కించారు.