విక్టరీ వెంకటేష్ నటజీవితంలో సంచలన విజయం సాధించిన సినిమా బొబ్బిలిరాజా. సురేష్ ప్రొడకన్స్ బ్యానర్ పై బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1990, సెప్టెంబర్ 14న విడుదలైంది. నేటికి సరిగ్గా 30 ఏళ్ళు పూర్తి చేసుకొన్న ఈ సినిమాతోనే దివంగత సుందరి దివ్యభారతి కథానాయికగా రంగ ప్రవేశం చేసింది. అభినేత్రి వాణీశ్రీ అటవీ శాఖాధికారిగా కీలక పాత్ర పోషించిన ఇందులో గమ్మడి వెంకటేశ్వరరావు, కోట శ్రీనివాసరావు, సత్యనారాయణ, బ్రహ్మానందం, సుమిత్ర, శివాజీ రాజా విద్యాసాగర్, బాబూ మోహన్, జయప్రకాశ్ రెడ్డి తదితరలు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఆ రోజుల్లో 3 కేంద్రాల్లో 175 రోజులు ఆడి రికార్డు సృష్టించింది సినిమా.
రాజా తన తల్లి , తాతలతో అడవిలో రహస్యంగా ఉన్న ఒక ఇంట్లో నివసిస్తూ ఉంటాడు. రాణి అటవీశాఖాధి కారి రాజేశ్వరి కూతురు. ఒకసారి స్నేహితులతో సరదాగా అడవికి టూర్ కు వచ్చిన రాణికి రాజా పరిచయం అవుతాడు. ఇద్దరూ ప్రేమలో పడతారు. కానీ రాణి తల్లి రాజేశ్వరీదేవి ఇద్దరినీ వేరు చేస్తుంది. రాణి కి రాజా తన బావ అని అర్ధమవుతుంది. రాజా బొబ్బిలి లోకి అడుగుపెట్టి .. అత్త రాజేశ్వరీదేవి పొగరు అణిచి ఆమె కు అల్లుడవ్వడమే మిగతా కథ.
ఇందులో వెంకీ అయ్యో అయ్యో అయ్యయ్యో అనే ఊతపదం వాడతాడు. అప్పట్లో ఈ పదం చాలా ఫేమస్ అయింది. ఇందులోని కొన్ని సరదా సన్నివేశాలు ‘గాడ్స్ మస్ట్ బీ క్రేజీ’ అనే హాలీవుడ్ మూవీనుంచి లిఫ్ట్ చేశారు. ఇక ఈ సినిమాకి మాస్ట్రో ఇళయారాజా అద్భుతమైన సంగీతం అందించారు. బలపం పట్టి భామ బళ్ళో, చెమ్మ చెక్క చెమ్మచెక్క, వద్దంటే వినవే, కన్యాకుమారి కనబడదా దారి , అయ్యయ్యో లాంటి పాటలన్నీ అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి.