కొందరు దర్శకులు ఫ్యామిలీ మూవీస్ తీయడంలో దిట్ట. మరికొందరు దర్శకులు ఎమోషనల్ డ్రామాస్ తెరకెక్కించడంలో ఉద్దండులు. ఇంకొందరు ఈ రెండింటినీ యాక్షన్ మూవీస్ తో మిక్స్ చేసి తెరకెక్కించడంలో చెయితిరిగిన దర్శకులు. అలాంటి ఓ హైపర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ తో హీరోల ఇమేజ్ ను అమాంతం పెంచే ఈ దర్శకుడు .. తన కెరీర్ బిగినింగ్ నుంచి కూడా అదే జోనర్ తో తనదైన స్టైల్లో సినిమాలు తీస్తూ వస్తున్నాడు. తన ప్రతీ సినిమాలోనూ హైరేంజ్ లో యాక్షన్ ఉంటుంది, హ్యూమన్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్ కూడా కామన్ గా ఉంటాయి.
గుంటూరు జిల్లా, పెదకాకానిలో జన్మించాడు బోయపాటి శ్రీను. గుంటూరులోని జేకేసీ కళాశాల నుంచి డిగ్రీ పట్టభద్రుడైన ఆయన నాగార్జున విశ్వ విద్యాలయంలో చేరాడు. వారి కుటుంబానికి ఫొటో స్టూడియో ఉండటంతో అటువైపు ఆసక్తిని కనబరిచాడు. అనంతరం కొన్నాళ్లపాటు పాత్రికేయుడిగా పనిచేశాడు. 1997లో ముత్యాల సుబ్బయ్య దగ్గర దర్శకత్వ శాఖలో చేరాడు. ‘ఒక చిన్న మాట’, ‘గోకులంలో సీత’, ‘పెళ్ళి చేసుకుందాం’, ‘పవిత్ర ప్రేమ’, ‘అన్నయ్య’, ‘మనసున్న మారాజు’ తదితర చిత్రాలకి సహాయ దర్శకుడిగా పనిచేశాడు బోయపాటి. ‘భద్ర’తో దర్శకుడిగా పరిచయమయ్యారు. తొలి చిత్రమే ఘన విజయం సాధించడంతో బోయపాటి శ్రీనుకి అగ్ర కథానాయకులతో కలిసి సినిమాలు చేసే అవకాశం వచ్చింది. వెంకటేష్‌తో ‘తులసి’, బాలకృష్ణతో ‘సింహా’ తీసి విజయాల్ని అందుకొన్నాడు. 2012లో ఎన్టీఆర్ కథానాయకుడిగా ‘దమ్ము’ తీశాడు. 2014లో బాలకృష్ణతో ‘లెజెండ్’ తీసి మరో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత అల్లు అర్జున్ కథానాయకుడిగా ‘సరైనోడు’ తీశాడు. ఆ చిత్రం భారీ స్థాయిలో వసూళ్లు సొంతం చేసుకుంది. ‘జయ జానకి నాయక’తో పర్వాలేదనిపించిన ఆయన… ‘వినయ విధేయ రామ’తో పరాజయాన్ని చవిచూశాడు. ప్రస్తుతం బాలకృష్ణతో కలిసి మూడో చిత్రం చేస్తున్నాడు. ‘లెజెండ్’ చిత్రానికిగానూ ఆయనకి ఉత్తమ దర్శకుడిగా నంది పురస్కారం లభించింది. నేడు బోయపాటి శ్రీను పుట్టిన రోజు.. ఈ సందర్భంగా ఆ మాస్ దర్శకుడికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.