సినిమాలు ఫాస్ట్ గా తీయడం, నటీనటుల కాల్షీట్స్ ప్రకారం షూటింగ్ అనుకున్న టైమ్ కి అనుకున్నట్టుగా పూర్తి చేయడం జానపద బ్రహ్మ విఠలాచార్య స్టైల్. అంతేకాదండోయ్.. టైమ్ కి ప్రధాన పాత్రలు దొరకకపోతే.. ఆ పాత్రల్ని కుక్కలు, పాములు, చిలకలు గా కూడా మార్చిపడేయంలో ఆయనదిట్ట. ఇక ఆయన ఆర్టిస్టులకు పక్కాగా పేమెంట్ ఇచ్చేవారట. అది కూడా తన చేతులతోనే ఇవ్వడం ఆయనకి అలవాటు. అలాంటి విఠలా చార్య.. సీనియర్ నటులతో ఎంతో మర్యాద పూర్వకంగా ప్రవర్తించేవారట. అంతేకాదు వారికి పారితోషికం ఇవ్వడంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునేవారట. దర్శకుడిగా తన కెరీర్ ప్రారంభించినప్పటి నుంచీ ఆయన అదే స్వభావంతో ఉండేవారు.
విఠలాచార్య తన కెరీర్ బిగినింగ్ లో ‘కన్యాదానం’ సినిమా తీశారు. ఆ సినిమానే మళ్లీ ఆయన ‘నిన్నే పెళ్లాడతా’ పేరుతో ఎన్.టి.ఆర్ని పెట్టి పునర్నిర్మించారు. ‘కన్యాదానం’లో హీరో చలం. అందులో ఒక పాత్రకి సి.ఎస్.ఆర్ని అడిగారట విఠలాచార్య. ‘‘మూడు రోజుల పాత్ర, మీకు ఐదువేలు ఇస్తాను’’ అన్నారాయన. సి.ఎస్.ఆర్ ‘ఇప్పుడు మూడురోజులంటారు – తరువాత 6,7 రోజులు తీస్తారు. అంచేత రోజు లెక్కలో అడుగతాను’ అని ఆలోచించుకుని, – ‘రోజుకి వెయ్యి రూపాయలు చొప్పున ఇవ్వండి’ అన్నారు. అలాగే అన్నారు విఠలాచార్య. అయితే, షూటింగ్ మూడురోజుల్లోనే అయిపోయింది! సి.ఎస్.ఆర్కి దక్కింది మూడువేలే! కానీ పెద్దమనసుగల విఠలాచార్య ‘‘అయినా, నేను ఆ పాత్రకి అనుకున్నది ఐదువేల రూపాయలు. మీరు రోజుకి వెయ్యి అడిగినా నేను అనుకున్న ప్రకారం మీకు ఐదువేలు ఇస్తాను, తీసుకోండి’’ అని సిఎస్సార్ లెక్కలో రెండువేలు ఎక్కువ ఇచ్చారు విఠలాచార్య. దటీజ్ జానపద బ్రహ్మ.