ఘట్టమనేని వారి వారసుడు మహేశ్ బాబు.. బాలనటుడిగా ఉన్నప్పుడే.. తెలుగు తెరమీద యాక్షన్ హీరోగా విజృంభించాడు. ఆ వయసులోనే చాలా ఎనర్జిటిక్ గా పాటల్లో స్టెప్స్ వేస్తూ.. ఫైట్స్ చేస్తూ… ఘట్టమనేని వారి అభిమానుల్ని అలరించాడు. ఈ నేపథ్యంలో అతడు నటించిన యాక్షన్ మూవీ బాలచంద్రుడు. 1990లో విడుదలైన ఈసినిమా 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. పద్మాలయ బ్యానర్ పై కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో మహేశ్ బాబు కెరీర్ కు బాగా ఫెచ్ అయింది. అక్క కాపురాన్ని సరిదిద్దే తమ్ముడిగా మహేశ్ బాబు ఇందులో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు.
కైకాల సత్యనారాయణ, శరత్ కుమార్, రామిరెడ్డి, గీత, ప్రభాకరరెడ్డి, చంద్ర మోహన్, ఆహుతి ప్రసాద్, రాజా , బాబూ మోహన్, అనంత్, ఈశ్వరరావు, లతాశ్రీ, డిస్కోశాంతి ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. పరుచూరి బ్రదర్స్ మాటలు, త్యాగరాజన్ ఫైట్స్ అందించగా… సంగీతం రాజ్ కోటి సమకూర్చారు. అక్కయ్య పెళ్ళికూతురాయెనే అనే పాట ఎంతో ఫేమస్ అయింది. ఈ సినిమా తర్వాత మరో తొమ్మిదేళ్ళకు మహేశ్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. నిజానికి మహేశ్ బాబుకు హీరోగా ఎదగడానికి ముందుగానే మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టిన సినిమాల్లో ‘బాలచంద్రుడు’ కూడా ఒకటి.