దక్షిణాది  భాషలలో ఈ మధ్య కొంత ఈ రీమిక్స్ ట్రెండ్ తగ్గినా..  బాలీవుడ్ లో  మాత్రం చాలా మంది దర్శక నిర్మాతలు కొనసాగిస్తున్నారు. అయితే ఓల్డ్ క్లాసిక్స్ ని రీమిక్స్ చేసి నాశనం చేస్తున్నారనే విమర్శలు అటు ప్రేక్షకుల నుంచి,  ఆ పాటలు ఒరిజినల్స్ కి పనిచేసిన వారి నుంచి తరుచుగా విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే నేటితరం దర్శకులు మాత్రం వారి మాటలు లెక్క చేయకుండా ఇష్టానుసారంగా రీమిక్స్ చేస్తున్నారు. తాజాగా ఢిల్లీ-6 సినిమాలో రెహమాన్ మసాకలి పాటని తనిష్క్ బగ్చి రీమేక్ చేశారు. ఈ పాట‌ను తుల‌సి కుమార్, సాచెట్ ఆల‌పించ‌గా సిద్దార్థ్ మ‌ల్హోత్రా, తారా సుతారియాల మీద తెర‌కెక్కించారు.

అయితే రెహమాన్ మ్యూజిక్ అందించిన ఒరిజిన‌ల్ సాంగ్ విని ఈ రీమేక్ సాంగ్ ని విన్నవాళ్ళు ఆ దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ మీద డైరెక్ట్ గానే విమర్శలు చేస్తున్నారు.ఈ నేప‌థ్యంలో రెహ‌మాన్ సైతం ఈ పాట‌పై స్పందించాడు. ఎంజాయ్ ద ఒరిజిన‌ల్ అంటూ త‌న మ‌సక్క‌లి పాట‌ను ట్విట్ట‌ర్లో షేర్ చేశాడు.అంతే కాక‌ ఆ పాట కోసం ఎంత‌మంది ఎలా క‌ష్ట‌ప‌డింది కూడా వివ‌రించాడు. దాదాపు ఏడాది పాటు ఈ పాట కోసం సంగీత చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని, రైటింగ్, సింగింగ్ విష‌యంలో ఎన్నో వెర్ష‌న్లు మారాయ‌ని, 200 మంది మ్యుజీషియ‌న్స్ ఈ పాట కోసం ప‌ని చేశార‌ని రెహ‌మాన్ గుర్తు చేసుకున్నాడు.ఇంత క‌ష్ట‌ప‌డి చేసిన పాట‌ను రీమేక్ చేసి చెడగొట్టారని పరోక్షంగా ఆ సంగీత దర్శకుడుకి రెహమాన్ చివాట్లు పెట్టినట్లు పోస్ట్ బట్టి అర్ధమైంది. దీనిపై వాళ్ళు ఎలాంటి వివరణ ఇస్తారు అనేది చూడాలి.

Leave a comment

error: Content is protected !!