కరోనా మహమ్మారి దెబ్బ అన్నిరంగాలకు చాలా ఎక్కువగా తగిలింది . లాక్ డౌన్ కారణంగా దేశం మొత్తం స్తంభించిపోయింది. సినీ పరిశ్రమ సైతం షూటింగ్స్‌ను వాయిదా వేయడంతో సినీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న రోజువారీ సినీ కార్మికులు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఏరోజుకారోజు కూలీ చేసుకునే వారి పరిస్థితి మరింత ఘోరంగా మారింది. దీంతో వారికి కుటుంబ పోషణ కష్టంగా మారింది. దీంతో వీరికి అండగా ఉండేందుకు ఇప్పటికే చాలా మంది ముందుకు వచ్చి తమకు తోచిన సాయం చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో సిసిసి పేరుతో చిరంజీవి నాయకత్వంలో సహాయం అందిస్తున్నారు. కాగా.. బాలీవుడ్ హీరోలు కూడా తమ వంతు విరాళాల్ని ప్రకటిస్తున్నారు. ఇప్పటికే కరోనాపై ఫైట్ కోసం ప్రధాని మోడీ ఏర్పాటు చేసిన ‘పీఎం కేర్’ విరాళానికి ఏకంగా అక్షయ్ కుమార్ 25 కోట్ల విరాళం ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు.
తాజాగా కరోనాపై పోరాడుతున్న ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కు రూ.3 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. మున్సిపల్ కార్మికు ఆరోగ్యం కోసం పీపీఈ కిట్స్ కోసం ఈ డబ్బును అందజేశాడు. ఈ విషయాన్ని భారత సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్ష్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. కరోనాపై పోరాడుతున్న వారికి అక్షయ్ కుమార్ కూడా ధన్యవాదాలు తెలిపాడు. పోలీసులు పారిశుధ్య కార్మికులు ఆర్మీ అదికారులు – వలంటీర్లు తదితరులకు హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు. కరోనాపై ఫైట్ కోసం అక్షయ్ కుమార్ చేస్తున్న గొప్ప సహాయానికి అభిమానులు ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.