కృష్ణ నటించిన కుటుంబ కథా చిత్రాల్లో మరపురాని సినిమా ‘మరపురాని కథ’. శ్రీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుందర్ లాల్ నహతా, డూండీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి వి.రామచంద్రరావు దర్శకుడు. వాణీశ్రీ కథానాయికగా నటించిన ఈ సినిమా లో ఇంకా చంద్రమోహన్, కాంచన, చిత్తూరు నాగయ్య, సంధ్యారాణి, రావికొండలరావు, నాగభూషణం ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. టి.చలపతిరావు సంగీతం అందించగా.. భమిడిపాటి రాధాకృష్ణ సంభాషణలు సమకూర్చారు.

రఘు, రవి ప్రాణ స్నేహితులు. కొన్ని పరిస్థితుల వల్ల రవి ఇంటిని విడిచిపెట్టి బైటికి వచ్చేస్తాడు. ఒకరోజు అపస్మారక స్థితిలో రవిని చూసిన రఘు .. తన ఇంటికి తీసుకెళ్ళి.. తన మేనేజర్ పోస్ట్ ను కూడా వదలుకొని రవికి ఉద్యోగం ఇప్పిస్తాడు. ఇంతలో రఘుకి ఇంట్లో వారు ఒక సంబంధం తెస్తారు. రఘుకి ఆమె బాగా నచ్చుతుంది. కానీ ఆ ఫోటోని చూసిన రవి ఆమె గురించి ఒక చేదు నిజం చెబుతాడు. చివరికి రఘ, రవి జీవితం ఏ మలుపు తిరుగుతుంది అనేదే మిగతా కథ. నిజానికి ఈ సినిమా తమిళంలో శివాజీ గణేశన్ నటించిన ‘కై కొడుత్త దైవం’  సినిమాకి రీమేక్ వెర్షన్. ఇదే సినిమా ఆ తర్వాత మలయాళంలో ‘పలుంగు పాత్రం’ గానూ, హిందీలో ప్యార్ కీ కహానీ గానూ రీమేక్ అయి అక్కడ కూడా సూపర్ హిట్టైంది.

Leave a comment

error: Content is protected !!