చిత్రం : భీష్మ

నటీనటులు : నితిన్, రష్మికా మందణ్ణ, అనంతనాగ్, వెన్నెల కిషోర్, నరేష్, జిషు సేన్ గుప్తా, బ్రహ్మాజీ, రఘుబాబు, అజయ్, సమ్మెటగాంధీ తదితరులు

సంగీతం : మహతీ సాగర్

ఛాయాగ్రహణం : సాయిశ్రీనివాస్

బ్యానర్ : సితారా ఎంటర్ టైన్ మెంట్స్

నిర్మాత : సూర్యదేవర నాగవంశీ

దర్శకత్వం : వెంకీ కుడుముల

విడుదల తేదీ : ఫిబ్రవరి 21, 2020

నితిన్ సరిగ్గా సక్సెస్ చవిచూసి చాలా కాలం అయిపోయింది. అతడికి ఇప్పుడో హిట్టు చాలా అవసరం. ఈ నేపథ్యంలో వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరెక్కిన ‘భీష్మ’ చిత్రంతో ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చాడు.  విడుదలకు ముందే మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకుల అంచానాలను ఏ మేరకు అందుకుంది? నితిన్ ఈ సినిమా తో ప్రేక్షకుల్ని ఏ విధంగా మెప్పించాడో చూద్దాం.

కథ :

భీష్మ(నితిన్ ) డిగ్రీ కూడా పాసవని  కుర్రోడు. కనీసం ఒక్క అమ్మాయినైనా పడగొట్టి .. తన ప్రేమను సక్సెస్ చేసుకోవాలని తపిస్తుంటాడు. అలాంటి కుర్రోడి జీవితంలోకి సంధ్య ఎంటరవుతుంది. అతడితో ప్రేమలో పడుతుంది.  ఆమె కమీషనర్ (సంపత్ రాజ్ )కూతురు. తన కూతురు ప్రేమ విషయం తెలిసి కోపంతో రగిలిపోతూ.. భీష్మ కు వార్నింగ్ ఇవ్వాలని అతడి ఇంటికి వచ్చిన కమీషనర్ కు అది తన స్నేహితుడి (నరేష్ )  ఇల్లని , భీష్మ అతడికొడుకని తెలుస్తుంది. చిన్నప్పుడు భీష్మ  తన కూతుర్ని ముట్టుకున్నందుకే తన ఫ్రెండ్ షిప్ ను ఒదులుకున్న కమీషనర్ .. భీష్మని అవమాన పరుస్తూ మాట్లాడతాడు. దాంతో పట్టరాని కోపంతో తన కొడుకు భీష్మ ఆర్గానిక్స్ కంపెనీకి సియీవో అనే   నిజం చెప్పి … కమీషనర్ నోరు మూయిస్తాడు భీష్మ తండ్రి. అసలు  ఇంతకీ భీష్మ ఎవరు? డిగ్రీ కూడా పాసవని అతడు  భీష్మ ఆర్గానిక్స్ కంపెనీకి సియీఓ ఎలా అయ్యాడు ? అసలు  ఈ ప్రేమ కథలోకి సేంద్రీయ వ్యవసాయం టాపిక్ ఎందుకొచ్చింది? తెలియాలంటే.. ఈ రివ్యూ చూడాల్సిందే.  

కథనం , విశ్లేషణ :

నితిన్ లాంటి హీరోతో ఏ దర్శకుడైనా .. ప్రేమకథనైనా డీల్ చేస్తాడు. లేదా మాస్ యాక్షన్ మూవీనైనా ప్లాన్ చేస్తాడు. కానీ దర్శకుడు వెంకీ కుడుముల మాత్రం ఆ రెండిటినీ మిక్స్ చేసి దానికి కామెడీ పూత పూసాడు. అందులో మూడొంతుల భాగం  సక్సెస్ అయ్యాడు. కథగా చెప్పుకోడానికి ఏమీ లేని భీష్మ సినిమాకి సేంద్రీయ వ్యవసాయం అనే కొత్త రకం బ్యాక్ డ్రాప్ ను తీసుకొచ్చి.. స్ర్కీన్ ప్లే తో మ్యాజిక్ చేశాడు. ఇన్ స్టెంట్ అనే ప్రొడక్ట్ పేరుతో కెమిల్స్ మిక్స్ చేసిన ఎరువులతో ఆరునెల్లో రావల్సిన పంటను కేవలం నాలుగు నెలల్లోనే రాబట్టి.. ఎక్కువ లాభాలు ఆర్జించాలని తపించే ఒక ఎరువుల కంపెనీకి, కేవలం మట్టి తోనే ప్రజలకు ఆరోగ్యకరమైన కూరగాయలు సరఫరా చేసి.. వాళ్ళ ఆయు:ప్రమాణం పెంచాలని తపించే భీష్మ ఆర్గానిక్స్ కంపెనీకి మధ్య గల పోరును ఎంటర్ టైనింగ్ వేలో చెప్పాలనుకోవడం సాహసమే అయినా.. సబ్జెక్ట్ ను ఎక్కడా డీవియేట్ అవకుండా.. చేయడంతో దర్శకుడి ప్రయత్నం చాలా వరకూ సక్సెస్ అయింది. నితిన్ భీష్మ ఆర్గానిక్ కంపెనీకి సీయీవో గా మారే క్రమం మంచి ఎంటర్ టైనింగ్ వేలో సాగుతుంది. దాన్ని తెరమీద చూడాల్సిందే.  కాకపోతే.. నితిన్ పాత్రకు బాగా బిల్డప్ లు ఇవ్వడం, అతడి హీరోయిజాన్ని బాగా ఎలివేట్ చేయాలనుకోవడం కాస్త ఓవర్ అనిపిస్తుంది. కానీ… సినిమా అంతా సరదాగా సాగిపోతుంది.

ఫస్టాఫ్ అంతా రేసీగా సరదా సరదాగా కామెడీ గా సాగిపోతే.. సెకండాఫ్ కాస్తంత మందగించినట్టు అనిపిస్తుంది. కానీ దాన్ని కామెడీతో కవర్ చేసేశాడు వెంకీ కుడుముల. ప్రేక్షకులు షాక్ తినే ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చి.. దానికి సహేతుకమైన రీజనింగ్ పెట్టి.. జనాన్ని లాక్ చేసేస్తాడు.  మొత్తం మీద భీష్మ ప్రేక్షకుల్ని తన కామెడీతో బాగా ఎంటర్ టైన్ చేస్తాడు.

నటీనటుల పెర్ఫార్మెన్స్ :

అల్లరి చిల్లరిగా తిరిగే చిలిపి కుర్రోడిగా, ఎట్ ది సేమ్ టైమ్ .. సమయానుకూలంగా ఎత్తులు వేసే జీనియస్ గా నితిన్ బాగా పెర్ఫామ్ చేశాడు. సంధ్యగా రష్మికా మందణ్ణ గ్లామరస్ గాళ్ గానూ, పెర్ఫార్మెన్స్ పరంగానూ మంచి మార్కులేయించుకుంటుంది. ఇక భీష్మ ఆర్గానిక్ కంపెనీ ఓనర్ గా కన్నడ నటుడు అనంత నాగ్ .. తన అనుభవాన్నంతటినీ రంగరించి చాలా చక్కటి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అలాగే.. విలన్ గా అశ్వథ్థామ లో సైకో విలన్ గా నటించిన జిషుసేన్ గుప్తా .. తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో  మరోసారి అదరగొట్టాడు. ఇక  వెన్నెల కిషోర్ , రఘుబాబు , నరేశ్ , బ్రహ్మాజీ తమ కామెడీ టైమింగ్స్ తో ఇరగదీశారు. వీరిందరి అద్భుతమైన నటనతో భీష్మ సంక్రాంతి సినిమాల  తర్వాత మరో వర్త్ వాచ్  మూవీగా నిలిచిపోతుంది  అని చెప్పుకోవాలి.

సాంకేతిక నిపుణులు :

మహతి సాగర్ అందించిన సంగీతం ఈ చిత్రానికి మెయిన్ ప్లస్ పాయింట్. అతని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్లడంలో ఉపయోగపడుతుంది. అలాగే  సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ప్రతి ఫ్రేమ్  కలర్ఫుల్ గా ఉండి మెప్పిస్తుంది. ఇక ఈ మూవీ నిర్మాణ పరంగా రిచ్ నెస్ గా అనిపిస్తుంది.

రేటింగ్ : 3.5

బోటమ్ లైన్ : నవ్వుల విత్తనాలు నాటిన ‘భీష్మ’

review by : రామకృష్ణ క్రొవ్విడి 

 

 

 

 

Leave a comment

error: Content is protected !!