సినిమా నిర్మించడం ఆయనకో పేషన్. తీసిన ప్రతీ సినిమా కుటుంబ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలనే పట్టుదల కలిగిన నిర్మాత. అన్నది, అనుకున్నది ఆచరణలో పెట్టే ఉత్తమాభిరుచి కలిగిన నిర్మాణ సారథి. పేరు యస్. గోపాలరెడ్డి.  భార్గవ్ ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించిన అనితర సాధ్యమైన నిర్మాత ఆయన. బాలకృష్ణ తో అత్యుత్తమ సినిమాలు నిర్మించిన నిర్మాత ఆయన.

మంగమ్మగారి మనవడు’, ‘ముద్దుల మావయ్య’, ‘మువ్వ గోపాలుడు’, ‘ముద్దుల కృష్ణయ్య’, ‘మాతో పెట్టుకోకు’… తదితర విజయవంతమైన చిత్రాలు తీసిన అగ్ర నిర్మాతగా పరిశ్రమలో పేరు తెచ్చుకొన్నారు ఎస్‌.గోపాల్‌రెడ్డి.

నెల్లూరు జిల్లా, నాయుడు పేటలోని ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు ఎస్‌.గోపాల్‌రెడ్డి. సినిమాలపై ఆసక్తితో 1975లో మద్రాసు ప్రయాణమయ్యారు. కొంతమంది మిత్రులతో కలిసి సినిమా రంగంపై దృష్టిపెట్టిన ఆయన తొలుత రెండు అనువాద చిత్రాలతో అదృష్టాన్ని పరీక్షించుకొన్నారు. అవి లాభాల్ని అందించకపోవడంతో ‘మనిషికో చరిత్ర’ అనే చిత్రాన్ని నిర్మించారు. కొత్త సంస్థ నుంచి వచ్చిన ఆ సినిమాపై మొదట్లో సందేహాలు వ్యక్తమైనప్పటికీ, విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఆ తర్వాత ‘ముక్కుపుడక’, ‘మంగమ్మగారి మనవడు’… ఇలా వరుసగా సినిమాలు తీస్తూ విజయాల్ని అందుకొన్నారు. తన సినీ ప్రయాణంలో ఎక్కువగా బాలకృష్ణతోనే తీశారు గోపాల్‌రెడ్డి. బాలకృష్ణతో మరో సినిమా నిర్మించాలనే ప్రయత్నంలో ఉండగానే 2008లో అనారోగ్యంతో మృతిచెందారు . నేడు  గోపాలరెడ్డి  వర్ధంతి. ఈ సందర్భంగా ఆయనకి ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.

Leave a comment

error: Content is protected !!